ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తుల అర్హతపైనా పరిశీలన
కొత్తగా పింఛన్లు మంజూరయ్యేవారికి జనవరి 1 నుంచి పంపిణీ
కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 21–25 తేదీల మధ్య
సోషల్ ఆడిట్, వెరిఫికేషన్ డిసెంబర్ 1–14 తేదీల మధ్య
ఆమోదం పొందిన జాబితాల వెల్లడి డిసెంబర్ 15
కొత్తగా మంజూరైన వారికి పింఛన్ పంపిణీ 2020, జనవరి 1 నుంచి
అమరావతి అక్టోబర్ 30 (way2newstv.com)
సంతృప్త (శాచ్యురేషన్) స్థాయిలో రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ.. తదితర పింఛన్లు మంజూరుకోసం నవంబర్ 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. నవంబర్ 25వ తేదీ వరకు వలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల పరిధిలో అర్హులనుంచి వారి ఇంటివద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు.
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు కార్యాచరణ సిద్ధం
అదే సమయంలో ఇప్పటికే అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్ని సైతం వలంటీర్లు పరిశీలించి.. వాటిలోనూ అర్హత ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుంటారు. పింఛన్లకోసం కొత్తగా అందిన దరఖాస్తులతోపాటు ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్నవారి వివరాలతో గ్రామ, పట్టణ వార్డులవారీగా జాబితాలు తయారుచేసి, వాటిపై ఆ ప్రాంత ప్రజలందరి సమక్షంలో డిసెంబర్ 1–14వ తేదీల మధ్య సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 15న మంజూరు చేసిన తుది పింఛనుదారుల జాబితాను ప్రకటించి.. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి 2020, జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నట్టు వారు వివరించారు. నవంబర్ 5 నుంచి అధికారులకు శిక్షణ : కొత్త పింఛనుదారుల దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటికే పింఛను తీసుకుంటున్నవారి వెరిఫికేషన్ ప్రక్రియపై నవంబర్ 5 నుంచి అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. 5న జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున శిక్షణ ఇస్తారు. నవంబర్ 7, 8 తేదీల్లో ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఇద్దరేసి చొప్పున అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణ అందజేస్తారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో నవంబర్ 12, 13, 14 తేదీల్లో స్థానిక సిబ్బందికి శిక్షణ ఇస్తారు. నవంబర్ 15–20 తేదీల మధ్య గ్రామ, వార్డు వలంటీర్లకు ఈ ప్రక్రియపై శిక్షణ ఇస్తారు.