ఒంగోలు, అక్టోబరు 26, (way2newstv.com)
ఒకే పార్టీలో ఉన్నా రాజకీయ కక్షలు ఎందుకు దూరమవుతాయి? బయటకు ఎన్ని సుద్దులు చెప్పినా అది సాధ్యం కాదు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇదే జరుగుతుంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఫ్యాక్షన్ ఎక్కడైనా ఉందీ అంటే అది అద్దంకి నియోజకవర్గంలోనే. అద్దంకి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా కరణం, గొట్టి పాటి వర్గాల మధ్య ఫ్యాక్షన్ ఘర్షణలు నడుస్తున్నాయి. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు బతికి ఉన్నప్పటి నుంచే కరణం, గొట్టిపాటి వర్గీయుల పోరు జరుగతూనే ఉంది. గొట్టిపాటి అప్పట్లో మార్టూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా కరణంతో పొసిగేది కాదు. ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. ఇక గొట్టిపాటి హనుమంతరావు తర్వాత ఆయన స్థానంలో తనయుడు గొట్టిపాటి నర్సయ్య ఎమ్మెల్యేగా పనిచేసినా ఎక్కువ కాలం రాజకీయాల్లో నిలదొక్కుకోలేక పోయారు.
వేగంగా మారుతున్న ప్రకాశం రాజకీయాలు
తర్వాత అదే కుటుంబంనుంచి గొట్టి పాటి రవికుమార్ రాజకీయాల్లో దిగి సక్సెస్ అయ్యారు. కరణం బలరాంకు ధీటుగా నిలబడ్డారు. గొట్టిపాటి వర్గానికి రవికుమార్ అండగా నిలబడటంలో పూర్తి విజయం సాధించారు. దీంతో కొన్నాళ్లుగా గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాంల మధ్య అద్దంకి నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది.గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ లో ఉంటే కరణం బలరాం తెలుగుదేశంలో ఉండేవారు. కాంగ్రెస్ నుంచి గొట్టి పాటి రవికుమార్ వైసీపీలో చేరి 2014లో విజయం సాధించారు. కరణం బలరాంకు వరస ఓటములు తప్పడం లేదు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ అంత బలం పెంచుకున్నారు. అయితే ఇప్పటికీ కరణం బలరాంకు అద్దంకి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక వర్గం అంటూ ఉంది. ఓటు బ్యాంకు ఉంది. కానీ గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ కే పార్టీ టిక్కెట్ కేటాయించి కరణం బలరాంను చీరాల నియోజకవర్గానికి పంపింది. ఇద్దరూ విజయం సాధించారు.అయితే అద్దంకిపై కరణం బలరాంకు ఆశపోలేదు. తన కుమారుడు కరణం వెంకటేష్ రాజకీయంగా ఎదగాలంటే అద్దంకి ది బెస్ట్ అని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారు. అందుకే కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్ ను వైసీపీలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడంతో వైసీపీలోకి వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లాలి. అదే వెంకటేష్ ను పంపితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అద్దంకిలో వచ్చే ఎన్నికల్లో కరణం వెంకటేష్ వైసీపీ నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇదే ఆలోచనలతో ఉన్న కరణం బలరాం ఇటీవల వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పుట్టినరోజు వేడుకలకు కుమారుడితో హాజరయ్యారు. ఇదే జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కరణం వెంకటేష్ ను వీలయినంత త్వరలో వైసీపీలోకి పంపాలన్నది కరణం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన భార్య వేర్వేరు పార్టీలో ఉండటాన్ని తప్పు పడుతున్న జగన్ దీనిని ఎలా అంగీకరిస్తారో చూడాల్సి ఉంది.