కొడుకుల భవితపై తండ్రుల్లో టెన్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొడుకుల భవితపై తండ్రుల్లో టెన్షన్

ఒంగోలు, అక్టోబరు 28, (way2newstv.com)
వారంతా తండ్రి చాటు బిడ్డలు. తండ్రి రాజ‌కీయాల‌కు అందిపుచ్చుకోవాల‌ని ప్రయ‌త్నాలు చేసిన వారు. అయితే, రాజ‌కీయాల్లో వారు పుంజుకునేందుకు చేసిన, చేస్తున్న ప్రయ‌త్నాలు ఒక్కటొక్కటిగా విఫ‌ల‌మ‌వుతున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా పుంజుకోగ‌ల‌మా? అని వారు త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. ఒక‌ప‌క్క ఈ వార‌సుల తండ్రులు వ‌యోవృద్ధులు అయిపోతుండ‌డం, మ‌రోప‌క్క, వార‌సుల‌కు రాజ‌కీయంగా గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురవుతుండ‌డంతో వీరి ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలోని కేఈ కృష్ణమూర్తి పుత్రర‌త్నం, అనంత‌పురంలోని జేసీ బ్రద‌ర్స్‌, ఇదే జిల్లాలోని దివంగ‌త ప‌రిటాల త‌న‌యుడు, గుంటూరులోని రాయ‌పాటి కుమారుడు, ప్రకాశం జిల్లాలోని క‌ర‌ణం కుమారుడు, చిత్తూరులోని బొజ్జల వంశోద్ధార‌కుడు, ఇదే జిల్లాకు చెందిన గాలి ముద్దు కృష్ణమ కుమారుడు గాలి భానుప్రకాశ్‌ ఇలా చాలా మంది యువ నాయ‌కుల ప‌రిస్థితి ఇప్పుడు అగ‌మ్య గోచ‌రంగా ఉంది.
కొడుకుల భవితపై తండ్రుల్లో టెన్షన్

వీరిలో కేఈ కుమారుడు శ్యాంబాబు, క‌ర‌ణం బ‌ల‌రాం కుమారుడు వెంక‌టేష్‌(2014లో పోటీ చేసి ఓడిపోయారు), జేసీ బ్రద‌ర్స్ ఇద్దరు కుమారులు ప‌వ‌న్‌, అస్మిత్ రెడ్డిలు, ప‌రిటాల కుమారుడు శ్రీరాం, బొజ్జల కుమారుడు సుధీర్‌, రాయ‌పాటి కుమారుడు రంగారావు(ఈయ‌న ఇప్పటి వ‌ర‌కు ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు)లు రాజ‌కీయంగా త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచి తీరుతామ‌ని, చంద్రబాబు ప్రవేశ పెట్టి అమ‌లు చేసిన ప‌థ‌కాలు, తమ కుటుంబాలు స్థానికంగా చేసిన అభివృద్ధి వంటివి త‌మ‌కు క‌లిసి వ‌స్తాయ‌ని వీరంతా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, వీరు అనుకున్న విధంగా రాజ‌కీయాలు జ‌ర‌గ‌లేదు. నిజానికి రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. వీరు ఓడినంత మాత్రాన వీరి క‌థ ముగిసింద‌నేది కాదు.కానీ, ఈ వార‌సుల కుమారుల‌కు ఈ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్లు చూశాక మాత్రం వీరికి ఆశించినంత ప్రజాద‌ర‌ణ లేద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఏ ఒక్కరూ కూడా ఆశించిన స్థాయిలో మెరుగైన ఫ‌లితాలు సాధించ‌లేక పోయారు. ఏదో ఓ 500 లేదా 1000 ఓట్లతేడాతో ఓట‌మి పాలైతే.. ఫ‌ర్వాలేదులే.. వ‌చ్చే 2024 నాటికి పుంజుకుంటారు అని స‌రిపెట్టుకునే ప‌రిస్థితి ఉండేది. కానీ, తాజా ఎన్నిక‌ల్లో వీరికి వేలాది ఓట్ల తేడా వ‌చ్చింది. గెలుపు గుర్రం ఎక్కిన వారికి వీరికి వేల సంఖ్యలో ఓట్ల తేడా ఉంది. పైగా వీరిలో ప‌రిటాల‌, బొజ్జల‌, గాలి త‌దిత‌రులు తొలిసారి ఎన్నిక‌ల కురుక్షేత్రంలో పోటీ చేసిన వారు.మ‌రి తొలిసారే వీరి ప‌రిస్థితి ఇలా ఉంటే.. వ‌చ్చే నాలుగున్నరేళ్ల త‌ర్వాత ప‌రిస్థితి ఏంటి? అనేది వీరికి మెలిపెడుతున్న అంశం. ఒక‌ప‌క్క జ‌గ‌న్ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న జోరు ప‌థ‌కాల‌తో ఆ పార్టీపైనా ప్రభుత్వంపైనా ప్రజ‌ల్లో సానుభూతి పెరుగుతుండ‌డంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని నిల‌బెట్టడం, పుంజుకునేలా చేయ‌డం వీరికి త‌ల‌కు మించి న భారంగా ప‌రిణ‌మించింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరు అస‌లు రాజ‌కీయాల్లో ఉంటారా ? లేక త‌మ వ్యాపారాలు చాల‌ని స‌రిపెట్టుకుంటారా ? చూడాలి.