విజయవాడ, అక్టోబరు 28, (way2newstv.com)
రాజకీయాల్లో గెలుపు గుర్రం ఎక్కడం అంతవీజీ కాదు..! ఎంతో అదృష్టం ఉండాలి. వరుస విజయాలు సాధిం చడం కూడా అంతే. సీనియర్ రాజకీయ దిగ్గజం, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు రాజకీయాల్లో అనతి కాలంలోనే మంచి పేరు సంపాయించుకున్నారు. తనకు తిరుగులేని విధంగా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి నాయకుడు కూడా హోం మినస్టర్ గా చేసిన తర్వాత.. ఓటమి పాలయ్యారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే ఎదురు చూడాల్సి వచ్చింది. 1985లో కృష్ణాజిల్లా నందిగామ నుంచి విజయం సాధించిన వసంత నాగేశ్వరరావు మంత్రిగా బెర్త్ దక్కించుకున్నారు.తన నిర్ణయాలతో రాష్ట్రంలో కొత్త ఊపు తెచ్చారు.
ఉమను దెబ్బ తీసేందుకు వసంతవ్యూహాలు
పోలీసులకు-ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన తర్వాత ఎన్నికల టైంకు ఆయన కాంగ్రెస్‌లోకి మారిపోయారు. వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన గొడవల తర్వాత వసంత నాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన తన సిట్టింగ్ స్థానమైన నందిగామ నుంచి పోటీ చేయకుండా జగ్గయ్యపేటకు మార్చుకుని నెట్టెం రఘురాం పై పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చి ఉండేది.ఇక, ఆ తర్వాత కూడా పోటీ చేసినా, ఆయన విజయం సాధించలేక పోయారు. 1994లో ఆయన దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకటరమణపై ఓడిపోగా… 1999లో రమణ మృతితో వెల్లువెత్తిన సానుభూతి పవనాల నేపథ్యంలో రమణ సోదరుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా గెలిచారు. ఆ ఎన్నికల్లో వసంత తనయుడు కృష్ణప్రసాద్ ఓడిపోయారు. అప్పటి నుంచి దశాబ్దాల పాటు కృష్ణా రాజకీయాల్లో వసంత నాగేశ్వరరావు ఫ్యామిలీ వర్సెస్ దేవినేని ఫ్యామిలీ మధ్య వార్ నడుస్తోంది. వసంత ఫ్యామిలీపై దేవినేని ఫ్యామిలీ మొత్తంగా మూడు సార్లు విజయం సాధించింది. అప్పటి నుంచి వసంత ఫ్యామిలీ ఒక్కసారి అయినా గెలిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు.ఆ తర్వాత వసంత ఫ్యామిలీ టీడీపీకి దగ్గరైనా ఆక్కడ ప్రయార్టీ లేకపోవడం.. ఉమా చేష్టల వల్ల అవమానాలకు గురవ్వడంతో వైసీపీలోకి జంప్ చేసింది. తాజా ఎన్నికల్లో ఆయన కుమారుడు కృష్ణప్రసాద్ ఉరఫ్ కేపీ.. మైలవరం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేసి.. అప్పటి మంత్రి దేవినేని ఉమాను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. వాస్తవానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ అధినేత వసంత కృష్ణప్రసాద్ ను జగన్ కోరారు.అయినప్పటికీ.. తాను మైలవరం నుంచే తన సత్తా చాటుతానని ప్రతిజ్ఞ చేసిన వసంత కృష్ణప్రసాద్ ఆ మేరకు జగన్ నుంచి హామీ పొంది.. ప్రచారం నుంచి ఎన్నికల వరకు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఫలితంగా ఆయన విజయం నమోదు చేశారు.వివాద రహితుడిగా, మంచి మనిషిగా.. అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా, అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. మొత్తానికి మూడున్నర దశాబ్దాల తర్వాత వసంత వెలుగులు పూయించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మైలవరంతో పాటు నందిగామలో మళ్లీ వసంత నాగేశ్వరరావు ఫ్యామిలీ సగర్వంగా రాజకీయాలు చేస్తోంది. అదే టైంలో ఈ ఫ్యామిలీ చిరకాల రాజకీయ శత్రువు దేవినేని ఉమ తొలిసారిగా ఓటమి పాలయ్యి ఏ పదవి లేకుండా కాలం గడుపుతున్నారు. ఉమను రాజకీయంగా దెబ్బతీసేందుకే వసంత కృష్ణప్రసాద్ నిత్యం ప్రయత్నిస్తున్నారు.