హూజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హూజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

నల్గొండ, అక్టోబరు 16 (way2newstv.com):
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పార్టీలు వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేపడుతున్నాయి. తమకు కంచుకోట లాంటి హుజూర్‌నగర్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల బరిలో ఉత్సాహంగా దూకే టీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా ఉత్తమ్ ఫ్యామిలీకి చెక్ పెట్టడం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ప్రచారానికి తుది గడువు దగ్గర పడుతున్న తరుణంలో.. గురువారం సీఎం కేసీఆర్‌‌తో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.ఈ సభ కోసం టీఆర్ఎస్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే ఈ సభను ట్రెండ్ సెట్టింగ్ సభ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని.. ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటేస్తారన్నారు.
హూజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

హుజూర్‌నగర్లో గెలిచి తీరుతామని టీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్‌ కేడర్ బలంగా ఉన్నప్పటికీ.. ఎన్నికల ముందు భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. ఇది తమకు కలిసొస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ సంఖ్యలో నేతలను మోహరించింది.ముందుగా టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ.. ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలతో మద్దతు ఉపసంహరించుకుంది. కానీ ఈ ప్రభావం తమ మీద ఉండబోదని.. పైగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. ఈ ఎన్నికలో బరిలో దిగుతుండటం తమకు కలిసొస్తుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. హుజూర్‌నగర్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించిన తర్వాత.. కారు టాప్ గేర్‌లో దూసుకెళ్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. టీఆర్ఎస్ అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయనేది అక్టోబర్ 24న తేలనుంది.