ఈ నామ్ సెంటర్లలో అన్నీ కొరతే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈ నామ్ సెంటర్లలో అన్నీ కొరతే

కర్నూలు, అక్టోబరు 12, (way2newstv.com)
కర్నూలు జిల్లాలోని మార్కెట్‌ యార్డుల్లో ప్రయోగశాలల సేవలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. జిల్లాలో ఈ-నామ్‌ పరిధిలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ యార్డులను చేర్చింది. వీటిలో పత్తికొండ మినహా మిగిలిన మూడు రెగ్యులేటెడ్‌ మార్కెట్లలో అసైన్‌ ల్యాబ్‌ సేవలను తెరపైకి తెచ్చింది. పత్తి, వేరుశనగ, ఆముదాలు, పూలవిత్తనాలు, శనగలు, కందులు, కుసుమలు, వాము తదితర పంట దిగుబడుల విక్రయాలు సాగుతాయి. ఏటా మూడు యార్డుల్లో దాదాపు  రూ.3 వేల కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. యార్డులో ఎన్‌సీఎంఎల్‌ ద్వారా ల్యాబ్‌ సేవలను అందిస్తున్నారు. యార్డులకు రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులను పరిశీలించి.. వాటి నాణ్యత నిర్ధారించి.. మెరుగైన ధరలు అందించడమే వీటి లక్ష్యం. 2018, ఏప్రిల్‌ 24న వీటి సేవలను ఆరంభించారు. 
ఈ నామ్ సెంటర్లలో అన్నీ కొరతే

ఒక్కో కేంద్రంలో 5 నుంచి 10 మందికి సిబ్బందిని కేటాయించారు. సేవలు ఆరంభమై నాలుగు మాసాలైనా ఇంతవరకు వీటి ఫలితాలు మాత్రం పుడమిపుత్రులకు అందడం లేదు.  లక్ష్యాన్ని విస్మరించి.. కేవలం సంఖ్య కోసమే చేయాలనేట్లుగా యార్డుల్లో పని నడిచిపోతోంది.నిజానికి యార్డుకు వచ్చిన సరకును ముఖద్వారంలో అంతర్జాలంలో నమోదు చేసి లాట్‌ సంఖ్యలు కేటాయించాలి. అక్కడి నుంచి యార్డులో ఉంచాక..లాట్‌ల ఆధారంగా దిగుబడుల నమూనాలు తీసుకుని.. వాటిని పరిశీలించి.. నూనె, తేమ శాతం ఇలా పలు రకాలుగా పరిశీలించి.. అంతర్జాలంలో పొందుపర్చాలి. అనంతరం దేశవ్యాప్తంగా గుర్తించిన ఈ-నామ్‌ మార్కెట్లలో గుర్తింపు పొందిన వ్యాపారులు అంతర్జాలంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి ఎక్కడి నుంచైనా రైతు సరకుకు టెండరు వేయవచ్చు. అనంతరం అంతర్జాలం ద్వారానే చెల్లింపులు జరిగిపోతాయి. దీనివల్ల సాగుదారుకు పోటీ పెరిగి.. మేలైన ధర అందే అవకాశం ఉంది.యార్డుల్లో ప్రస్తుతం కేవలం నూనె గింజల పంట దిగుబడులను పరీక్షలు చేస్తున్నారు. ఆదోనిలో వేరుశనగ, ఎమ్మిగనూరులో వేరుశనగ, శనగలు, ఆముదాలు, కర్నూలు యార్డులో వేరుశనగ, కందులు, శనగలు, ఆముదాలకు మాత్రమే ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు యార్డుల్లో తేమ, ఔటన్‌ తదితర శాతాలు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. కర్నూలు యార్డులో ఎన్‌ఐఆర్‌ యంత్రం మాత్రమే ఉంది. ఈ యంత్రం ఉంటే.. సరకుకు మరింత నాణ్యత నిర్ధారించి.. మెరుగైన ధరలు అందించే అవకాశాలు ఉన్నాయి. యంత్ర పరికరాల కొరత వల్ల..రైతులకు నష్టం వాటిల్లుతోంది. వచ్చే సీజన్‌ నాటికైనా వీటిపై దృష్టిసారిస్తే ఎంతో మేలు కలిగే వీలుంది. ఇక మిగిలిన పంట దిగుబడుల పరిస్థితిపై ఇంతవరకు అధికారులు ఎలాంటి నిర్ణయాలు చేయకపోవడం గమనార్హం. పాత పద్ధతుల్లోనే వ్యాపారాలు సాగుతున్నాయి. టెండర్‌కు ఉంచిన సరకుకు వ్యాపారి వేసే ధరే రైతులు అందుకుంటున్నారు. వ్యాపారి ఎంత ధర వేస్తే.. అంతకే కర్షకులు అమ్మేసి ఇంటిబాట పడుతున్నారు. నిజానికి ఏదైనా లాట్‌కు తక్కువ ధర అందితే.. రైతు అసైన్‌ ల్యాబ్‌కు వచ్చి.. తన పంటను పరిశీలన చేసుకుని.. నిర్ధారించుకోవచ్చు. సేవలు పూర్తిగా ఉచితం. అందుకు తగ్గట్లు ధర అందకపోతే.. యార్డు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రచార లేమి.. రైతుల నిరక్షరాస్యత.. అమాయకత్వం వల్ల.. వీటి సేవలు మరుగున పడుతున్నాయి. ఈ-నామ్‌ నిర్వహణ భేషుగ్గా ఉన్నా... ఇంకా పూర్తిగా రూపాంతరం చెందించడంలో అధికారులు సఫలీకృతం కావడం లేదు. రోజూ ఒక్కో మనిషి 30 లాట్లకు మించి పరీక్షలు చేయలేరు. ఇక ఒక్కో లాట్‌ను పరిశీలించాలంటే.. కనీసం 10-15 నిమిషాలు పడుతుంది. ప్రస్తుతం అన్‌సీజన్‌ కావడంతో పదుల సంఖ్యలో లాట్లలో దిగుబడులు వస్తున్నాయి. అదే సీజన్‌ సమయమైతే వందల సంఖ్యలో వస్తాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్యతో వీటికి నాణ్యత పరీక్షలు చేయాలంటే సాధ్యం కాని పని. పంటలకు పరీక్షలు చేయించుకునే రైతుల సంఖ్య పెరిగితే ల్యాబ్‌ నిర్వాహకులు చేతులెత్తేయాల్సిందే.