క్రాస్ రోడ్స్ లో ఆదినారాయణరెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్రాస్ రోడ్స్ లో ఆదినారాయణరెడ్డి

కడప, అక్టోబరు 15, (way2newstv.com)
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారనేది ఆయనకే తెలియదు. ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం రాజకీయంగా మౌనవ్రతం తీసుకున్నట్లుంది. ఎన్నికలకు ముందు హడావిడి చేసిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత కన్పించకుండా పోయారు. జమ్మలమడుగుకే ఆదినారాయణరెడ్డి పరిమితమయ్యారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదినారాయణరెడ్డి పూర్తిగా నీరసించి పోయారు. జగన్ సర్కార్ తనను, తన అనుచరులను ఇబ్బంది పెడుతుందని ఆయనకు తెలియంది కాదు.అందుకే ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. 
క్రాస్ రోడ్స్ లో ఆదినారాయణరెడ్డి

రెండు నెలల క్రితం డిసైడ్ అయిన ఆదినారాయణరెడ్డి భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను హైదరాబాద్ లో కలిశారు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నడ్డా సలహా మేరకు అమిత్ షా సమక్షంలో ఢిల్లీ వెళ్లి పార్టీ కండువా కప్పుకోవాలని ఆదినారాయణరెడ్డి నిర్ణయించుకున్నారు. ఈలోపు తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని కూడా ఆదినారాయణరెడ్డి కలిశారు. తాను పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పుకున్నారు. చంద్రబాబు సయితం ఆదినారాయణరెడ్డి నిర్ణయానికి ఓకే చెప్పారు.ఇది జరిగి రెండు నెలలు అయినా ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరలేదు. పార్టీ కండువా కప్పుకోలేదు. రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కండువా కప్పుకోకుండానే వెనక్కు వచ్చేశారు. అయితే ఇది ముందు నుంచి అనుకుంటున్నదే. తన ప్రత్యర్థి సీఎం రమేష్ అప్పటికే బీజేపీలో ఉండటం, రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆదినారాయణరెడ్డి చేరికకు సీఎం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారని, అందుకే బీజేపీ అధిష్టానం రెడ్ సిగ్నల్ వేసిందన్న టాక్ బాగానే విన్పించింది. కడప జిల్లాకు చెందిన ఒక బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి చేరికకు ఎంత ప్రయత్నించినా అధిష్టానం మాత్రం ఒప్పుకోలేదు.దీంతో ఆదినారాయణరెడ్డి రెండు నెలల నుంచి ఏ పార్టీలోనూ లేరు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. బీజేపీలో చేరేందుకు నడ్డా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు కాషాయ పార్టీ అంగీకరించకపోవడంతో ఆదినారాయణరెడ్డి ఏ పార్టీలో లేరు. ఆయన బెంగళూరు, హైదరాబాద్ లలోనే ఎక్కువగా ఉంటున్నారు. కడప జిల్లా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల కొందరు వెళ్లి ఆయనను కలవగా తనను కలసి ప్రయోజనం లేదని, వెళ్లి చంద్రబాబును కలవమని చెప్పినట్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నాలుగేళ్లు పెత్తనం చేసిన ఆదినారాయణరెడ్డిని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు.