అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దుతున్నాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దుతున్నాం

బొటనికల్ గార్డెన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించడం గొప్ప విషయం
-  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 19  (way2newstv.com)
హైదరాబాద్ లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్ కు ఐఎస్ఓ సర్టిఫికేట్ లభించింది. స్థానిక గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ఎఫ్ డీసీ అధికారులు ఐఎస్ఓ సర్టిఫికేట్ అందుకున్నారు. ఐటీ కారిడార్ లో అర్బన్ లంగ్ స్పేస్ కోసం ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను బొటానికల్ గార్డెన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్ దక్కింది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కులకు అంతర్జాతీయ గుర్తింపు రావడం గొప్ప విషయమని అన్నారు. 
అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దుతున్నాం

ఒక పార్కుకు  దేశంలోనే  ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం ఇదే మొదటిసారి అని, బొటానికల్ గార్డెన్ కు ఈ అరుదైన అవకాశం దక్కడం సంతోషదాయకమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అటవీ శాఖ అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దుతుందని మంత్రి తెలిపారు. బొటానికల్ గార్డెన్ కు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం శుభ పరిణామమని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో బొటానికల్ గార్డెన్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. సందర్శకులు, వాకర్స్ కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అన్నారు. అంతకు ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బొటానికల్ గార్డెన్ లో వాకర్స్ తో కలిసి వాకింగ్ చేశారు. ఈ సందర్బంగా రెండేళ్ల క్రితం తాను నాటిన మొక్కను పరిశీలించారు.... అది నేడు చెట్టుగా ఎదిగిందని, దాన్ని చూసి మరిసిపోయారు.  అనంతరం పార్కులో సౌకర్యాలపై సందర్శకులతో కాసేపు మంత్రి ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ రఘువీర్, హెచ్ వైయం సీఈవో అలపాటి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.