ఒంగోలు, అక్టోబరు 22, (way2newstv.com)
పురందరేశ్వరీ ఆమె నందమూరి తారకరాముని గారాలపట్టి. తెలుగు రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసిన అన్నగారి ఇంటి ఆడపడుచు. సీనియర్ రాజకీయ నేతగా ఉన్న దగ్గుబాటి వారి ఇంటి కోడలు. పురంద్రీశ్వరి. 2004 ఎన్నికల్లో పురంద్రీశ్వరి తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. బాపట్ల నుంచి పురంద్రీశ్వరి ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసినపుడు నందమూరి కుటుంబం హస్తంతో చెలిమి చేయడమేంటని అంతా విస్తుబోయారు. చంద్రబాబు నాయకత్వాన ఉన్న టీడీపీ నీడన చేరని తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలివిగా పావులు కదిపి చిన్నమ్మను అలా కాంగ్రెస్ నుంచి అరంగేట్రం చేయినపుడు టీడీపీ తమ్ముళ్ళు సైతం షాక్ తిన్నారు. ఎన్టీయార్ ఇంట సమర్ధురాలైన వారసురాలు రాజకీయాల్లోకి వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా కట్టారు.
పురందరేశ్వరీ గోడ దూకేస్తారా...
సంకుల, సంక్లిష్ట రాజకీయ సమరంలో పురంద్రీశ్వరి ఆదిలోనే శభాష్ అనిపించేసుకున్నారు. 2004 ఎన్నికల్లో సరిగ్గా వేసిన దగ్గుబాటి వారి రాజకీయ అంచనాలు వమ్ము కాలేదు. వైఎస్సార్ గాలిలో పురంద్రీశ్వరి ఎంపీగా నెగ్గి పార్లమెంట్ లో తొలిసారి అడుగుపెట్టారు. అయిదేళ్ళ కాలంలో తనను తాను నిరూపించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పెద్దల కళ్ళలో పడి మంచి మార్కులే కొట్టేశారు. ఇక రెండవమారు విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన చిన్నమ్మను నందమూరి తనయగా అన్నగారి ట్యాగ్ తో పాటు, అప్పటికే ఎంపీగా మెరిపించిన మెరుపులు కూడా తోడు కావడంతో పెద్ద ఊపుతో గెలిచారు. దాంతో ఆమె కేంద్ర మంత్రిగా కూడా నియమితులయ్యారు. అయిదేళ్ల పాటు మంత్రిణిగా పురంద్రీశ్వరి ఏకంగా ప్రధాని మన్మోహన్ సింగ్ మన్ననలు కూడా అందుకుని గ్రేట్ అనిపించేసుకున్నారు.ఉమ్మడి ఏపీని రెండువా విడదీయకపోతే పురంద్రీశ్వరి ఇప్పటికీ ఎంపీగా మళ్ళీ మళ్ళీ నెగ్గి ఉండేవారన్న భావన అందరిలోనూ ఉంది. కాంగ్రెస్ విభజించి తెలుగు రాష్ట్రాల్లో దూరం కాగా బీజేపీలో చేరిన చిన్నమ్మకు గత అయిదేళ్ళుగా ఎటువంటి రాజకీయ గుర్తింపు దక్కలేదు. దానికి తోడు అన్న గారి కుమార్తెగా పురంద్రీశ్వరి ప్రభావం కూడా తగ్గిపోవడం, ఆంధ్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో 2019 ఎన్నికల నాటికి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి డిపాజిట్లు సైతం కొల్పోయారు. ఈ పరిణామంతో పురంద్రీశ్వరి రాజకీయ జీవితమే ఇబ్బందుల్లో పడింది.ఇక బీజేపీలో ఇపుడు కొత్త నీరు వచ్చిచేరింది. చంద్రబాబు సన్నిహితుడిగా ముద్రపడిన ఎంపీ సుజనా చౌదరి బీజేపీలో చేరడంతో ఆయన హవా బాగా పెరిగింది. ముఖ్యంగా ఏపీకి సంబంధించి సుజనా ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగిపోవడంతో ముందుగా దెబ్బ తిన్నది పురంద్రీశ్వరి అని చెప్పాలి. ఎందుచేతనంటే కోస్తాలో బలమైన కమ్మ సామాజికవర్గాన్ని ఎర వేసే శక్తియుక్తులు చిన్నమ్మ కన్నా సుజనాచౌదరికి ఎక్కువగా ఉన్నాయని బీజేపీ కేంద్ర నాయకత్వం నమ్ముతోంది. సుజనా రాకతో బీజేపీలో పురంద్రీశ్వరి జోరుకు అలా ఒక్కసారిగా బ్రేకులు పడిపోయాయి. అదే సమయంలో గత కొంతకాలంగా ఆమె పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తారన్నది కూడా వట్టిమాటేనని తేలిపోవడంతో ఓ విధంగా సైడ్ అయిపోయారని అంటున్నారు. ఇక సుజనాకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆ ముచ్చట కూడా తీరిపోతే బీజేపీలో పురంద్రీశ్వరి పూర్తిగా తెరమరుగు కాక తప్పదని అంటున్నారు.