కేశినేని నాని కామ్ వెనుక... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేశినేని నాని కామ్ వెనుక...

విజయవాడ, అక్టోబరు  19(way2newstv.com)
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మళ్లీ దూరం జరుగుతున్నారా? గత కొంతకాలంగా ట్వీట్లతో నానుతున్న నాని ఇప్పుడు కామ్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వేధిస్తుందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలసి ఫిర్యాదు చేశారు. అయితే ఈ బృందంలో కేశినేని నాని లేకపోవడం చర్చనీయాంశమైంది.కేశినేని నాని గత నెల రోజులుగా మౌనంగా ఉంటున్నారు. 
కేశినేని నాని కామ్ వెనుక...

చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలు తప్పించి కేశినేని వేరేకార్యక్రమాలకు హాజరుకావడం లేదు. కేశినేని నానికి టీడీపీలో ఏ నేతలతో పొసగకపోవడమే ఇందుకు కారణంగా చెప్పాలి. కేశినేని నానికి చెందిన భవనం నుంచి పార్టీ కార్యాలయాన్ని కూడా తొలగించడంతో ఒకింత ఆగ్రహంతో ఉన్నారు. కేశినేని నానికి మాజీమంత్రి దేవినేని ఉమకు పడదు. అలాగే కేశినేని నాని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అంటే మండిపడుతున్నారు. వీరిద్దరి మధ్య కొన్ని రోజుల పాటు ట్వీట్ల వార్ కూడా జరిగిన సంగతి తెలిసిందే.అయితే చంద్రబాబు దేవినేని ఉమ, బుద్దా వెంకన్నలకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో కేశినేని నాని మౌనంగా ఉండటమే బెటరని భావిస్తున్నట్లుంది. ఇక ఎంపీగా కేశినేని నాని ఢిల్లీ వెళ్లినా సహచర ఎంపీలతో కలవడం తక్కువేనని చెబుతున్నారు. గల్లా జయదేవ్ ను పార్లమెంటు పార్టీ నేతగా ఎంపిక చేయడం పట్ల ఆయన కొంత అసహనాన్ని అప్పట్లో ప్రదర్శించారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో కేశినేని పాల్గొన్నా ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయ్యారు. ట్విట్టర్ లోనూ పెద్దగా కన్పించడం లేదు.కేశినేని నానికి సుజనా చౌదరితో స్నేహబంధం ఉంది. ఒకానొక సమయంలో కేశినేని నాని బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. కానీ తాను టీడీపీలోనే కొనసాగుతానని కేశినేని నాని స్పష్టం చేశారు. కేశినేని నాని పార్టీలో ఉన్నా లేనట్లే కన్పిస్తుంది. విజయవాడతో పాటు తన పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో తన ప్రమేయం లేకుండానే టీడీపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకోవడం కూడా కేశినేని నాని సైలెన్స్ కు కారణమని చెబుతున్నారు. ఇటీవల కాలంలో జగన్ సర్కార్ పై కూడా కేశినేని నాని విమర్శలు తగ్గించారు. మరి దీనికి కారణాలేంటో? తెలియాలి.