గుంటూరులో రంగులు మారుతున్న గురజాల నియోజవర్గం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గుంటూరులో రంగులు మారుతున్న గురజాల నియోజవర్గం

గుంటూరు, అక్టోబరు 5, (way2newstv.com)
గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతానికి చెందిన గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయం మారింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ హ‌వా చ‌లాయించిన టీడీపీ తాజా ఎన్నిక‌ల్లో ప‌త్తా లేకుండా పోయింది. వాస్త‌వానికి కాంగ్రెస్‌, టీడీపీలు ఇక్క‌డ మార్చి మార్చి గెలుపు గుర్రం ఎక్కుతున్నాయి. ఈ క్ర‌మంలోనే 2009, 2014లో వ‌రుస‌గా టీడీపీ నేత య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు విజ‌యం సాధించారు. 1999, 2004 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే… త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన కాసు మ‌హేష్ రెడ్డి ఇక్క‌డ పాగా వేశారు. 
గుంటూరులో రంగులు మారుతున్న గురజాల నియోజవర్గం

దీంతో ఇప్పుడు ఇక్క‌డ రాజ‌కీయాలు మారిపోయాయి. అయితే, ఇవే కొన‌సాగుతాయా? టీడీపీ ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.కాసు మ‌హేష్‌రెడ్డి న‌ర‌సారావుపేట‌కు చెందిన నేత అయినా గురజాల‌కు మారి మ‌రీ విజ‌యం సాధించారు. ఇక గురజాల పాలిటిక్స్ విష‌యంలోకి వెళ్తే.. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత‌.. 1985లో టీడీపీ విజ‌యం సాధించింది. ముత్యం అంకిరెడ్డి తొలిసారి ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌రేశారు. 1989లో కాంగ్రెస్, 1994లో టీడీపీ.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండుసార్లు కాంగ్రెస్‌, రెండు సార్లు టీడీపీ గెలిచాయి. ఇక్క‌డ ఒక పార్టీ అంటూ ప్ర‌త్యేకంగా పునాది వేసుకున్న ప‌రిస్థితిలేదు. ఇప్ప‌టికీ ఇక్క‌డి గ్రామాల్లో కాంగ్రెస్‌కు అభిమానులు ఉన్నారు. సంప్ర‌దాయ ఓటు బ్యాంకు కూడా ఈపార్టీ సొంతం. అయితే, ఇదే ఇప్పుడు కాసు మ‌హేష్‌రెడ్డికి క‌లిసి వ‌చ్చింది. ఇక‌, రెండు సార్లు వ‌రుస‌గా విజ‌యం సాధించిన య‌ర‌ప‌తినేని సంక్షేమ కార్యక్ర‌మాలు విస్తృతంగా చేప‌ట్టారు. త‌న‌దైన శైలిలో మ‌హిళ‌ల‌కు, యువ‌త‌కు కూడా చేరువ‌య్యారు. దీంతో ఆయ‌న విజ‌యం మూడోసారి కూడా ఖాయ‌మ‌ని అనుకున్నారు.కుంభకోణాల్లో కూరుకుని….కానీ, రాజ‌కీయంగా దూకుడు, కింది స్థాయి గ‌ణాన్ని దూరం చేసుకోవ‌డం, లేటైరైట్ కుంభ‌కోణం, కేసులు.. మొద‌లైన‌వి ఇక్క‌డ య‌ర‌ప‌తినేని దూకుడుకు బ్రేక్ వేశాయి. ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో గురజాల నుంచి విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కుడు కాసు మ‌హేష్ రెడ్డికి ఇక్క‌డ అభిమానులు ఎక్కువ‌గానే ఉన్నారు. ఆయ‌న యువ‌కుడు కావ‌డం, ఇక్క‌డి స‌మ‌స్య‌లపై దాదాపు ఏడాది నుంచి అధ్య‌య‌నం చేయ‌డం, రెండు నెల‌ల‌పాటు పాద‌యాత్ర చేయ‌డం వంటివి క‌లిసి వ‌చ్చాయి. కాసు కుటుంబానికి రాజ‌కీయంగా ఉన్న ప్రాబ‌ల్యం కూడా ఈయ‌న‌కు క‌లిసి వ‌చ్చింది. వ‌చ్చే రోజుల్లో ఇదే ఆయ‌నకు ప్ల‌స్ గా మారుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.గుర‌జాల‌లో గ‌తంలో కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి, కాసు వెంక‌ట‌కృష్ణారెడ్డి ఓడిపోయారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం కాసు ఫ్యామిలీకి క‌లిసి రాద‌న్న సెంటిమెంట్ బ్రేక్ చేసి మ‌రీ మ‌హేష్‌రెడ్డి ఇక్క‌డ విజ‌యం సాధించ‌డంతో పాటు ప‌ట్టు సాధించారు. అయితే, వ‌చ్చే ఐదేళ్ల పాటు ఆయ‌న చేయ‌బోయే అభివృద్ధిపైనే ఇదంతా ఆధార‌ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. కొసమెరుపు.. ఇక్క‌డ రెండు పార్టీలు మారి మారి అధికారం చేప‌ట్టినా.. స‌మ‌స్యలు మాత్రం ప‌రిష్కారం కావ‌డంలేద‌నే ప్ర‌చారం మాత్రం ఉంది. దీనిపైనే ఇప్పుడు కాసు దృష్టి పెట్టారు. వీటి ప‌రిష్కారానికి ఆయ‌న ప్ర‌య‌త్నం చేస్తే.. రాబోయే రోజుల్లో.. ఫ‌లితం ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని అంటున్నారు.ఇక గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో గుర‌జాల‌, దాచేప‌ల్లిని న‌గ‌ర పంచాయ‌తీలుగా చేయాల‌ని కూడా ఇప్ప‌టికే కాసు అసెంబ్లీలో సైతం ప్ర‌స్తావించారు. త్వ‌ర‌లోనే ఈ రెండు న‌గ‌ర పంచాయ‌తీలు కానున్నాయి. ఇక అటు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఇక్క‌డ టీడీపీ రాజ‌కీయాలు శాసిస్తోన్న య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు తాజా ఓట‌మితో డీలా ప‌డ్డారు. మ‌రోవైపు అక్ర‌మ‌మైనింగ్ కేసుల్లో ఆయ‌న‌పై సీబీఐ విచార‌ణ‌కు రెడీ అవుతుండ‌డంతో పాటు ఈ నియోజ‌క‌వ‌ర్గంపై వైసీపీ ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తుండ‌డంతో ఆయ‌న వీటిని ఎదుర్కొని ఎలా ? ముందుకు వెళ‌తారా ? అన్న‌ది చూడాలి.