ఇంటి రిజిస్ట్రేషన్లు ఇక ఈజీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంటి రిజిస్ట్రేషన్లు ఇక ఈజీ

ఏలూరు, అక్టోబరు 25, (way2newstv.com)
ఇప్పటివరకూ ఎవరైనా ఆస్తులు కొనాలంటే రిజిస్ట్రేషన్‌ ఫీజుతోపాటు దస్తావేజు లేఖరులకు రుసుం, రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చెల్లించాల్సిన మామూళ్లు కలిపి తడిసి మోపెడవుతోందని ఆందోళన చెందేవారు. ఇకపై రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మామూళ్ళు, లేఖరులకు వేలల్లో రుసుము చెల్లించాల్సిన అగత్యం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కక్షిదారులకు స్వాంతన కలిగించింది. రిజిస్ట్రార్‌ కార్యాలయాలంటేనే దళారీ వ్యవస్థకు పెట్టనికోటగా నిలుస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ నూతన రిజిస్ట్రేషన్‌ విధానం ద్వారా ఆయా కార్యాలయాల వద్ద దళారీల వ్యవస్థకు దారులు పూర్తిగా మూతపడనున్నాయి. 
ఇంటి రిజిస్ట్రేషన్లు ఇక ఈజీ

ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అందుబాటులోకి రాగా ఈ నూతన విధానంతో ప్రజల ముంగిటికే రిజిస్ట్రేషన్‌ విధానం వచ్చేసింది. పబ్లిక్‌ డేటా ఎంట్రీ అనే నూతన విధానాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రవేశ పెట్టి మీ దస్తావేజులు మీరే తయారు చేసుకోండి అంటూ సాదర ఆహ్వానం పలుకుతోంది. ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇకపై లేఖరుల బాధలు, మామూళ్ల భయాలు లేకుండా ప్రశాంతంగా ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్‌ దస్తావేజు తయారు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం ఏలూరు రిజిస్ట్రేషన్‌ జిల్లా పరిధిలోని 12 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకు సుమారు 250 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వచ్చే  నవంబర్‌ 1నుంచి జిల్లాలో అమలులోకి రానున్న పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానంతో ఇక ఇంటి నుంచే రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కలగనుంది. ఇప్పటి వరకూ తిమ్మిని బమ్మినిచేసి ఒకరిపేరుపై ఉన్న ఆస్తిని మరొకరి పేరుపై ఉన్నట్లుగా చూపి తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసి ఎంతో మందికి దుఃఖం మిగిలి్చన ఘటనలు చూశాం. ఇకపై అటువంటి జిమ్మిక్కులు కుదిరే అవకాశం లేకుండా పటిష్టవంతమైన సాంకేతిక పరిజ్ఞానంతో పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానం అమలులోకి రానుంది. ఈ విధానంలో రిజిస్ట్రేషన్‌కు దస్తావేజు తయారుచేసుకునే సందర్భంలో అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌లో తాము కొనుగోలుచేసే ఆస్తి ఎవరిపేరుపై ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.ఏలూరు రిజిస్ట్రేషన్‌ జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సుమారు 150 మంది దస్తావేజుల లేఖరులు, వారికి సహాయకులుగా మరో 250 మందివరకూ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో కొందరు అవినీతి అధికారులకు మధ్యవర్తులుగా మారి కక్షిదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అధికారుల జీతాలకంటే వీరు కక్షిదారుల నుంచి వసూలు చేసే మొత్తమే ఎక్కువగా ఉంటోందనే విషయం జగమెరిగిన సత్యం. తరచూ రిజిస్ట్రేషన్లు చేయించే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సైతం వీరినే ఆశ్రయించాలి్సన పరిస్థితి ఇప్పటి వరకూ ఉండేది. ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చే పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానంతో దస్తావేజు లేఖరుల ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది.  ఐఓఎన్‌.ఏపీ.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ప్రిపరేషన్‌ ఆఫ్‌ డాక్యుమెంట్‌ అనే ఆప్షన్‌నుపై క్లిక్‌ చేస్తే వెంటనే రిజిస్ట్రేషన్‌కు చెందిన పూర్తి సమాచారం వస్తుంది. సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా తెలుగు భాషలో కూడా దస్తావేజు తయారు చేసుకునే సౌకర్యం కల్పించారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారు ముందుగానే తమకు అనుకూలమైన సమయానికి వెళ్ళవచ్చు. ఏ సమయానికి వస్తారనేది ముందుగా చెప్పి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారి వివరాలు దస్తావేజులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ఆస్తి విలువ ప్రకారం స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. కక్షిదారులు తమ మధ్య ఉన్న షరతులు, నిబంధనలను కచ్చితంగా పొందుపరచడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు మినహా ఏ ఇతర రుసుములు ఈ విధానం ద్వారా చెల్లించాలి్సన పని ఉండదు