విజయనగరం జిల్లాలో చెల్లా చెదురుగా టీడీపీ క్యాడర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయనగరం జిల్లాలో చెల్లా చెదురుగా టీడీపీ క్యాడర్

విజయనగరం, అక్టోబరు 22, (way2newstv.com)
విజయనగరం జిల్లాలో టీడీపికి నాయకత్వ సమస్య ఎక్కువగా కనపడుతోంది. ఇక్కడ పార్టీని నడిపించే వారు లేకపోవడంతో క్యాడర్ చెల్లాచెదురవుతోంది. మరోవైపు వైసీపీ బలంగా ఉండటంతో టీడీపీ క్యాడర్ రోజురోజుకూ ఇతర పార్టీల వైపు వెళ్లిపోతోంది. నాయకులే మారుతుండగా తామెందుకు మారకూడదనుకున్నారేమో కాని విజయనగరం జిల్లాలో టీడీపీ ద్వితీయశ్రేణినేతలు ఇతర పార్టీల బాట పట్టారు. దీనికి కారణం అశోక్ గజపతి రాజు అందుబాటులో లేకపోవడమే కారణమని అంటున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాలు అంటే అశోక్ గజపతిరాజును తీసి చూడలేం. అందులో ముఖ్యంగా టీడీపీ అంటేనే అశోక్ గజపతిరాజు.అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఎన్నడూ జరగని ఘోర అవమానం జరిగింది. 
విజయనగరం జిల్లాలో చెల్లా చెదురుగా టీడీపీ క్యాడర్

విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసేంది. ఎంపీగా అశోక్ గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యేగా ఆయన కుమార్తె ఆదితి గజపతిరాజు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీనిని అశోక్ గజపతిరాజు అవమానంగా ఫీలవుతున్నారు. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన జిల్లాలో లేరు. వెన్నునొప్పి కారణంగా గత నాలుగు నెలల నుంచి హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు. దీంతో అశోక్ గజపతిరాజు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించలేని పరిస్థితి.పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఎవరున్నా అశోక్ గజపతిరాజు మాట మీదే అందరూ నడిచే వారు. 2014 ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. ఆయన కేంద్రమంత్రిగా ఢిల్లీకే పరిమితమవ్వడం విజయనగరం జిల్లా రాజకీయాలను పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు చక్రం తిప్పారు. కాపు, బీసీ సామాజికవర్గం వారిని వెనకేసుకొచ్చి వర్గాలను సృష్టించారు. అశోక్ గజపతిరాజు తేరుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఎఫెక్ట్ ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ పడిందంటారు.పార్టీ తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఘోర ఓటమిని చవిచూడటంతో అశోక్ గజపతిరాజు హైదరాబాద్ లోనే ఉంటున్నారని ఆయన అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. పన్నెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలవ్వడంతో నేతలెవ్వరూ ఇక్కడ అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు తన సొంత ప్రాంతమైన పూసపాటి రేగకే పరిమితమవుతున్నారు. మాజీ జిల్లా అధ్యక్షుడు ద్వారంపూడి జగదీష్ పార్వతీపురానికే ఫిక్స్ అయ్యారు. దీంతో నేతలు, క్యాడర్ లలో అయోమయం నెలకొంది. అశోక్ గజపతిరాజు తిరిగి యాక్టివ్ అయితే తప్ప విజయనగరం జిల్లాలో మళ్లీ టీడీపీకి జవసత్వాలు రావన్నది ఆ పార్టీ క్యాడర్ నుంచి విన్పిస్తున్న కామెంట్స్. మరి రాజుగారు వస్తారా? వచ్చినా యాక్టివ్ అవుతారా? అనేది చూడాల్సి ఉంది.