అడ్రస్ లేకుండా పోయిన కనుమూరి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అడ్రస్ లేకుండా పోయిన కనుమూరి

ఏలూరు, అక్టోబరు 11, (way2newstv.com)
రాజ‌కీయాల్లో ఆయ‌న‌దో శ‌కం. కాంగ్రెస్ పార్టీలో నేరుగా ఢిల్లీలోని అధిష్టానం పెద్దల‌తో సంబంధాలు పెట్టుకుని చ‌క్రం తిప్పిన ఏపీ నాయ‌కుల్లో ఆయ‌న కూడా ఒక‌రు. ఈ క్రమంలోనే ఆయ‌న త‌న మ‌న‌సులోని కోరిక‌ల‌ను తీర్చుకున్నారు. ప‌ద‌వులు తెచ్చుకున్నారు. అయితే, అనూహ్యంగా ఇప్పడు రాజ‌కీయాల్లో క‌నిపించ‌డం మానేశారు. ఆయ‌నే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం మాజీ ఎంపీ.. క‌నుమూరి బాపిరాజు. రాజ‌కీయ‌ ప్రత్యర్థులు అంటే.. కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌రిమితం అనే సిద్ధాంతాన్ని తూచ త‌ప్పకుండా పాటించిన నాయ‌కులుగా ఈయ‌న పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్‌లో ప్రారంభించిన ప్రస్థాన్నాన్ని ఆయ‌న కొన‌సాగించారు. ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా.. ఆయ‌న పార్టీ మార‌లేదు. న‌ర‌న‌రాన కాంగ్రెస్ ను నింపుకొన్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన ఆయ‌న కృష్ణా జిల్లా కైక‌లూరు నుంచి వ‌రుస విజ‌యాలు సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న సొంత జిల్లాలోని రద్దయిన అత్తిలి నుంచి ఎన్టీఆర్ గాలిని త‌ట్టుకుని మ‌రి 1994లో గెలిచారు. 
అడ్రస్ లేకుండా పోయిన కనుమూరి

ఆ త‌ర్వాత న‌ర‌సాపురం ఎంపీగాను విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో రాజ‌కీయంగా ఆయ‌న‌కు ప్రత్యర్థులే త‌ప్ప శ‌త్రువులు లేక‌పోవ‌డం అత్యంత గ‌మ‌నించాల్సిన విష‌యం. న‌ర‌సాపురం నుంచి ఒకానొక సందర్భంలో క‌నుమూరి ఓడిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై గెలిచిన బీజేపీ ఎంపీ సినీ న‌టుడు కృష్ణంరాజుతో ఆయన క‌లివిడిగానే ఉన్నారు. ఇద్దరూ క‌లిసే ఒకే కారులో ప్రయాణించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇది అప్పట్లో చాలా చిత్రంగా చెప్పుకొనేవారు.రాజ‌కీయాల్లో ప్రత్యర్థులు అంటే కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కే.. అని న‌మ్మిన‌, ఆచ‌రించిన క‌నుమూరి బాపిరాజు ప‌ర‌మ ప‌విత్రమైన టీటీడీ చైర్మన్ ప‌ద‌విని ఏరికోరి రెండు సార్లు నిర్వహించుకున్నారు. ఈ విష‌యంలో రాష్ట్ర నేత‌ల‌తో సంబంధం లేకుండా నేరుగా ఆయ‌న కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దల‌ను ఒప్పించార‌ని అంటారు. రాష్ట్ర నాయ‌క‌త్వంతోనూ క‌లివిడి ఉంటూ.. అంద‌రినీ క‌లుపుకొని పోతూ.. త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేసిన క‌నుమూరి 2009లో ఎంపీగా విజ‌యం సాధించారు. ప్రజారాజ్యం ఎంట్రీతో జ‌రిగిన ముక్కోణ‌పు పోటీలో ఆయ‌న ఘ‌న‌విజ‌యం సాధించారు.ఆ త‌ర్వాత వైఎస్ మృతితో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోవ‌డంతో క‌నుమూరి బాపిరాజుకు అధిష్టానం మంచి ప్రయార్టీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయ‌న వ‌రుస‌గా రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా ప‌నిచేశారు. 2014లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసినా.. సొంత బంధువు, బీజేపీ నేత గోక‌రాజు గంగ‌రాజు చేతిలో ఓట‌మిపాల‌య్యారు. ఇక‌, అప్పటి నుంచి ఆయ‌న అడ్రస్ లేకుండా పోయారు. పార్టీ ప‌రంగా మ‌ధ్యలో ఆయ‌న వైసీపీలోకి వెళ‌తార‌ని వార్తలు వ‌చ్చినా అదే కాంగ్రెస్‌ను అంటి పెట్టుకుని ఉన్నారు. ఇటు న‌మ్ముకున్న కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే ప‌రిస్థితి లేదు. దీంతో ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో క‌నుమూరి బాపిరాజు శ‌కం ముగిసింద‌ని అంటున్నారు.