కర్నూలు, నవంబర్ 1, (way2newstv.com)
రాజకీయాల్లో నాయకుల శైలే భిన్నంగా ఉంటుంది. వారు ఏం మాట్లాడినా రికార్డే. ఎప్పుడు ఏం చేసినా రికార్డే. క్షణక్షణముల్ నేతల చిత్తముల్ అనే తరహాలోనే నాయకుల రాజకీయం ఉంటోంది. ఒక పార్టీలో ఉండి.. మరో పార్టీని, ఆ పార్టీ నాయకులను కొనియాడడం, పొగడ్తల వర్షం కురిపించడం, ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీపై ప్రశంసల జల్లు కురిపించడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా ఇలానే వ్యవహరిస్తుండడం ఆసక్తిగా మారింది. రాజకీయాలను ఎంతమేరకు వాడుకోవాలో.. అంతకు మించి వాడుకునే నాయకుల్లో ఒకరుగా టీజీ వెంకటేష్ పేరు తెచ్చు కున్నారు.మొదట్లో ఆయన రాజకీయ అరంగేట్రం టీడీపీలో మొదలైంది.
కొడుకు కోసం టీజీ రెండు పడవలపై కాళ్లు
తర్వాత ఆయన పదవులపై ఆశతో కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అండదండలతో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ను విడిచి పెట్టి టీడీపీ సైకిల్ ఎక్కారు. టీడీపీ నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. 2014లో టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేపథ్యంలోనే బాబు ఆయనను పెద్దల సభకు పంపారు.ఇక, 2019 నాటికి టీడీపీ అధికారం కోల్పోయే సరికి టీజీ వెంకటేష్ కూడా తన రాజకీయ పంథాను మార్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆయన కుమారుడు మాత్రం టీడీపీలోనే ఉండడం గమనార్హం. అంతేకాదు, కర్నూలు టీడీపీ ఇంచార్జ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అంటే.. తండ్రి బీజేపీ, కుమారుడు టీడీపీ. ఓకే ఓకే అని సరిపెట్టుకున్నారు అందరూ. అయితే, ఇంతలోనే టీజీ 01 నోట వైసీపీని కొనియా డుతూ కొన్ని డైలాగులు వచ్చాయి. దీంతో అందరూ నిర్ఘాంత పోయారు.బీజేపీలో ఉన్న కొందరు మాజీ టీడీపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు ఒకపక్క వైసీపీని తిట్టిపోస్తూ.. జగన్‌పై విరుచుకుపడుతున్నారు. అయితే, వీరితో కలిసి వెళ్లి బీజేపీ కండువా కప్పుకొన్న టీజీ వెంకటేష్ మాత్రం వైసీపీపై ప్రసంశల జల్లు కురిపిస్తుండడం రాజకీయంగా సంచలనంగా మారింది. తాను బీజేపీలోనే ఉండి.. తన కుమారుడిని వైసీపీలోకి పంపేందుకు టీజీ ప్రయత్నిస్తున్నారా? అనే సందేహలు తెరమీదికి వచ్చాయి. మరి ఈ విషయంలో క్లారిటీ కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు పరిశీలకులు