రోటీన్ గా విశాల్ యాక్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోటీన్ గా విశాల్ యాక్షన్

హైద్రాబాద్, నవంబర్ 14, (way2newstv.com)
తమిళ హీరో విశాల్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ‘పందెం కోడి’ సినిమాతో టాలీవుడ్‌లో పాగా వేసిన విశాల్.. తమిళంలో తెరకెక్కిన తన ప్రతి సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా ‘యాక్షన్’ సినిమాతో విశాల్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తనతో గతంలో రెండు సినిమాలు తెరకెక్కించిన సుందర్ సి దర్శకత్వంలో విశాల్ ఈ సినిమాను చేశారు. తమన్నా హీరోయిన్. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.సుభాష్ (విశాల్) ఇండియన్ ఆర్మీలో కల్నల్. అతని తండ్రి ముఖ్యమంత్రి. అన్నయ్య (రాంకీ) ఉపముఖ్యమంత్రి. పెద్ద కొడుకుకి తన పార్టీ పగ్గాలతో పాటు ముఖ్యమంత్రి పీటం అప్పగించి ఇకపై తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని విశాల్ తండ్రి నిర్ణయించుకుంటారు. 
రోటీన్ గా విశాల్ యాక్షన్

కొడుకుని తన రాజకీయ వారసుడిగా ప్రకటించడానికి ఒక మీటింగ్ పెడతారు. పార్టీ పొత్తుల్లో భాగంగా జాతీయ పార్టీ నుంచి ప్రధాన మంత్రి అభ్యర్థి గుప్తా కూడా ఈ మీటింగ్‌లో పాల్గొంటారు.అయితే, ఈ మీటింగ్‌లో బాంబు పేలుళ్లు జరుగుతాయి. ప్రధాని అభ్యర్థి గుప్తాతో పాటు మరికొంత మంది చనిపోతారు. వీరిలో సుభాష్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి కూడా ఉంటుంది. మరోవైపు, గుప్తాను ప్లాన్ ప్రకారమే సుభాష్ అన్నయ్య హత్యచేశారని సృష్టిస్తారు. దీంతో అల్లర్లు చెలరేగుతాయి. ఈ క్రమంలో సుభాష్ అన్నయ్య ఆత్మహత్య చేసుకుంటారు. తన అన్నయ్య నిర్దోషి అని తెలిసిన సుభాష్ అసలు నేరస్తుల కోసం వేట మొదలుపెడతాడు. ఈ వేటలో అతనికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి, చివరకు సుభాష్ ఏం చేశాడు అనేది సినిమాలో చూడాలి.తన ఫ్యామిలీకి ఒకడి వల్ల అన్యాయం జరగడం.. వాడి కోసం హీరో వేట మొదలుపెట్టడం.. చివరికి ఆ విలన్‌ను హీరో మట్టుబెట్టడం. ఈ అంశాలతో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాలో దర్శకుడు మరో ముఖ్యమైన పాయింట్‌ను తీసుకున్నారు. అదే ఉగ్రవాదం.. దానితో ముడిపడిన రాజకీయం. ఇండియాలో బాంబు పేలుళ్లకు పాల్పడి పాకిస్థాన్ పారిపోయి దాక్కున్న దావూద్ ఇబ్రహీం కథ తరహాలో ఉంది ఈ సినిమా. దీనికి ఆసక్తిరేపే యాక్షన్ సన్నివేశాలను జోడించారు. ఇన్వెస్టిగేషన్‌తో కూడిన యాక్షన్ డ్రామాను తెరపై ఆవిష్కరించారు.ఫస్టాఫ్ మొత్తం ట్విస్టులతో ఆసక్తికరంగానే సాగింది. అయితే, సెకండాఫ్‌కు వచ్చేసరికి కథేంటో తెలిసిపోతుంది. తరవాత ఏం జరుగుతుందో ఊహించేయొచ్చు. కాకపోతే, అది ఎలా జరుగుతుంది అనేది ఆసక్తికరం. ఎందుకంటే, యాక్షన్ ఎలిమెంట్స్‌ను అంత బాగా యాడ్ చేశారు దర్శకుడు. యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్‌లో చిత్రీకరించారు. విశాల్ స్టంట్లు ఇరగదీశారు. తమన్నా కూడా యాక్షన్ హీరోయిన్‌గా అదరగొట్టారు. కానీ, కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ నాసిరకంగా ఉంది.సినిమాకు మైనస్ ఏమైనా ఉందంటే అది సెకండాఫ్. రెండో అర్ధభాగంలో వచ్చే సన్నివేశాలు లాజిక్‌కు అందని విధంగా ఉంటాయి. విలన్‌ను వెతికే క్రమంలో హీరో లండన్, ఇస్తాంబుల్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అజర్ బైజాన్, అఫ్గానిస్తాన్ మీదుగా పాకిస్థాన్ వెళ్తాడు. ఇస్తాంబుల్‌లో నగర పోలీస్ కమిషనర్‌ను చాలా సింపుల్‌గా చంపేస్తాడు. ఇక, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మరీ రొటీన్. పాకిస్థాన్ ప్రభుత్వం తమ ఆర్మీతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేస్తే.. అలాంటి భద్రతా వలయాన్ని దాటుకుని విలన్‌ను హీరో కిడ్నాప్ చేసి ఇండియాకు తీసుకొచ్చేయడం వాస్తవానికి దూరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే.. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను కూడా జోకర్‌ని చేసేశారు.నటీనటుల విషయానికి వస్తే.. విశాల్, తమన్నాలదే మేజర్ పార్ట్. ఆర్మీ కల్నల్ పాత్రలో విశాల్ చక్కగా సరిపోయారు. ఎప్పటిలానే యాక్షన్ సన్నివేశాల్లో ఆయన అదరగొట్టారు. కల్నల్ సుభాస్ టీంలో అధికారిగా తమన్నా కనిపించారు. ఎప్పుడూ అందచందాలతో అలరించిన తమన్నా.. ఈసారి యాక్షన్ స్టంట్లతో అదరగొట్టారు. ఒకపాటలో అందాలనూ ఆరబోశారనుకోండి. ఇక క్లవర్ కిల్లర్ పాత్రలో ఆకాంక్ష పూరి అద్భుతంగా చేసింది. ఈమె కూడా ఒక పాటలో హాట్ హాట్‌గా అందాలను వడ్డించింది. షాయాజీ షిండే, రాంకీ, యోగిబాబు, కబీర్ దుహన్ సింగ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.సినిమా స్థాయి బాగుంది. ముఖ్యంగా డుడ్లే సినిమాటోగ్రఫీ అద్భుతం. లండన్, ఇస్తాంబుల్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఇంటెర్వల్ బ్యాంగ్‌లో వచ్చే యాక్షన్ సీన్ అయితే వాహ్ అనిపిస్తుంది. కాకపోతే కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. హిప్‌హాప్ తమిళ మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. పాటలు కూడా బాగున్నాయి. కాకపోతే, ఈ కథకు ఆ పాటలు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.మొత్తంగా చూసుకుంటే.. విశాల్ ‘యాక్షన్’‌తో థ్రిల్ చేశారు. కాకపోతే, కథ కాస్త రొటీన్‌‌గా అనిపిస్తుంది.