కేంద్రం వద్దకు ఆర్టీసీ పంచాయితీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేంద్రం వద్దకు ఆర్టీసీ పంచాయితీ

హైద్రాబాద్,  నవంబర్ 2, (way2newstv.com)
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆ‍ర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. సమ్మెపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలవనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. విపక్ష నేతలతో ఆర్టీసీ సంఘాల నాయకులు శనివారం  మధ్యాహ్నం విద్యానగర్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌ భవనంలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.సమావేశం అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె 28 రోజులుగా కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు.
కేంద్రం వద్దకు ఆర్టీసీ పంచాయితీ

సమ్మెపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలువనున్నట్లు తెలిపారు.ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి సోమవారం  లేదా మంగళవారం హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అవుతామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. కార్మికులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయనకు వివరిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ అంశంలో ప్రభుత్వం తీరు, కార్మికులు, విపక్షాలతో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లుబాటు కాదని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. రూట్లను వేరు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.ఈ భేటీలో ఆర్టీసీ సమ్మె భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 9న ట్యాంక్ బండ్‌పై దీక్ష, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేయనున్నారు. డిపోల ముందు నిరసన తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ జేఏసీ భవిష్యత్తు కార్యచరణ:
నవంబర్ 3: అన్ని డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాల ఏర్పాటు
నవంబర్ 4: రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్ష
నవంబర్ 5: సడక్ బంద్ (రహదారుల దిగ్బంధం)
నవంబర్ 6: డిపోల ముందు నిరసన
నవంబర్ 7: ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష
నవంబర్ 8: ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు
నవంబర్ 9: ట్యాంక్ బండ్‌పై దీక్ష, నిరసన కార్యక్రమాలు