అమరావతి నవంబర్ 4, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారు. ఆయనను బాపట్లలో ఉన్న మానవ వనరుల విభాగం ఇన్స్టిట్యూట్ కు బదిలీ చేశారు. ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే తన విధులను భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ కు అప్పగించి.. వెంటనే వెళ్లి తన విధుల్లో చేరాలని జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ రేసులో నీలం సహానీ, సునీల్ శర్మ ఉన్నట్టు తెలిసింది.
చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత కేబినెట్లో ‘వైఎస్ఆర్ అవార్డు’ పేరుతో ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అయితే, దానికి సంబంధించిన ఫైల్ చీఫ్ సెక్రటరీకి కనీసం తెలియకుండా నేరుగా కేబినెట్లో ప్రవేశపెట్టినట్టు సమాచారం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్వీ సుబ్రమణ్యం.. ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆగ్రహంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసినట్టు సమాచారం.