సిటీ ప్రయాణం... నరకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీ ప్రయాణం... నరకం

హైద్రాబాద్, నవంబర్ 4, (way2newstv.com)
ఆర్టీసీ సమ్మె కష్టాలు నగరవాసులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. దాదాపు 26 రోజులుగా బస్సుల కొరతతో ప్రయాణమంటేనే జనం నరకం చూస్తున్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయో తెలీదు…వచ్చిన బస్సుల్లోనూ జాగా ఉండదు. కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణం చేయలేక జనం అవస్థలు పడుతున్నారు. పైగా కొన్ని రూట్లలోనైతే బస్సులే ఉండటం లేదు. దీంతో జనం ఆటోలు లేదంటే క్యాబ్ ల్లోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. గత నెల రోజులు నుంచి వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో సిటీలోని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అవుతోంది.ఆర్టీసీ సమ్మె కారణంగా నగరంలో బస్సులపైనే ఆధారపడే 33 లక్షల మంది ప్రయాణికులు జేబులు గుల్లా చేసుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మధ్య తరగతి జనాలు నిత్యం మెట్రో లేదంటే క్యాబ్ లు, ఆటోల్లో వెళ్లాల్సి వస్తోంది.  
సిటీ ప్రయాణం... నరకం

దీంతో ప్రతి ఒక్కరికీ కనీసంగా రోజుకు వంద రూపాయలు ప్రయాణంలో భారం పడుతోంది. గత నెల 5 వ తేదీ నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది జనాలు తమ నెల వారీ ఖర్చు నుంచి 3 నుంచి 5 వేల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా నగరంలో బస్ పాస్ తీసుకొని ప్రయాణం చేసే వారిలో చాలా వరకు రూ.20 వేల లోపు జీతం ఉన్న వారే ఉంటారు. వీరికి నెలకు 3 నుంచి 5 వేల రూపాయల వరకు భారం అనేది చాలా ఎక్కువ. ఐతే ఒక్క నెల రోజులు అంటే ఎలాగో భరించగలం గానీ ప్రతి రోజు ప్రయాణానికి ఇంత ఖర్చు చేయటమంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి సిటీలో అన్ని వ్యాపార కార్యకలాపాలు కొనసాగాలంటే సిటీ బస్సులు కీలకం. సాధారణంగానే సిటీలో 3850 బస్సులు దాదాపు 15 వేల ట్రిప్పులు తిరుగుతాయి. అయినప్పటికీ మరో 3 వేల బస్సులు అవసరం ఉంది. అలాంటిది సమ్మె కొనసాగుతున్న 26 రోజుల నుంచి 1500 లకు మించి బస్సులు నడపటం లేదు. ఆ బస్సులు సైతం రోజుకు ఒకటి రెండు ట్రిప్పులకే పరిమితమవుతున్నాయి. దీంతో ఆఫీస్ వేళల్లో, కాలేజ్ టైమింగ్స్ కు అనుకూలంగా బస్సులు ఉండటం లేదు. ఇక రాత్రి పది అయ్యిందంటే సిటీ బస్సు జాడ కనిపించటం లేదు. ఆర్టీసీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు సిటీలో బస్సులు నడిపేందుకు రావటం లేదు. దీంతో ప్రయాణికులను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఉన్న బస్సుల ద్వారానే ప్రయాణం చేయండన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.