ప్రభుత్వం అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రభుత్వం అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

బస్సుల కోసం కేటాయించిన రుణాన్ని రాయితీ బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటారు
హైదరాబాద్‌ నవంబర్ 1 (way2newstv.com)
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని ఆక్షేపించింది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని.. రాయితీల బకాయిల చెల్లింపుగా నివేదికలో ఎలా పేర్కొంటారని కోర్టు నిలదీసింది. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై కోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సునిల్‌ శర్మ,  ఆర్థిక సలహాదారుడు రమేష్‌ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై  హైకోర్టులో ఆఫిడవిట్‌ దాఖలు చేశారు. 
ప్రభుత్వం అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము రూ. 644.51 కోట్లు రావాల్సి ఉండగా.. మొత్తం సొమ్మును చెల్లించినట్లు ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో బస్సులు నడుపుతున్నందుకు రూ. 1786.06 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అయితే 2015 నుంచి 2017 మధ్య కాలంలో జీహెచ్‌ఎంసీ కేవలం రూ. 336 కోట్లు మాత్రమే చెల్లించినట్లు కోర్టుకు వెల్లడించారు. మిగతా సొమ్మును చెల్లించేందుకు తమకు స్థోమత లేదని జీహెచ్‌ఎంసీ చేతులెత్తేసినట్లు ఆర్టీసీ ఆఫిడవిట్‌లో పేర్కొంది. జీహెచ్‌ఎంసీ నిబంధలు సెక్షన్‌ 112(30) ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి జీహెచ్‌ఎంసీ అంగీకరించలేదని ఆర్టీసీ కోర్టుకు తెలిపింది. అందువల్లన జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన నిధులను బకాయిలుగా పరిగణించరాదని వివరించింది. ఆర్టీసీలో నిర్వహణ, డీజిల్‌ భారం ఎక్కువగా ఉందని, నిర్వహణ వ్యయం కారణంగానే నష్టం వాటిల్లుతోందని ఆఫిడవిట్‌లో పేర్కొంది. కార్మికుల సమ్మె ప్రారంభమైన అక్టోబర్‌ 5 నుంచి 30 తేదీ వరకు బస్సుల ద్వారా రూ. 78 కోట్లు అర్జించగా.. రూ. 160 కోట్ల వ్యవమైనట్లు తెలిపింది.అయితే ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో అఫిడవిట్‌ను రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీ బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలా? లేదా తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో జీహెచ్‌ఎంసీ  ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవచ్చని, కానీ ప్రస్తుతం బాగానే ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.