సమ్మెపై నోరుఎత్తని మంత్రులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సమ్మెపై నోరుఎత్తని మంత్రులు

హైద్రాబాద్, నవంబర్ 6, (way2newstv.com)
ఆర్టీసీ సమ్మె పట్ల టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కఠిన వైఖరిని అవలంభిస్తుండటంతో మంత్రులు వౌన వ్రతం పాటిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తన స్పష్టమైన వైఖరిని మీడియా సమావేశాల్లో, అధికారుల సమీక్షల సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులు ఎవరు కూడా ఈ అంశంపై నోరు మెదపడానికి సహసించడం లేదు. సీఎం ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు విధుల్లో చేరాలని మాత్రమే ఒకరిద్దరు మంత్రులు పిలుపునివ్వడం తప్ప మరో మాట మాట్లాడటం లేదు. అయితే పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి ఈ అంశంపై స్పందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నా వారు స్పందించడం లేదు.
సమ్మెపై నోరుఎత్తని మంత్రులు

ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ను ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని మీడియా ప్రశ్నించగా ఆయన తిరస్కరించారు. పార్టీ సీనియర్ నేతలు, మంత్రులే ఈ అంశంపై మాట్లాడకపోవడంతో ఇతరులేవ్వరూ నోరు మెదపడం లేదు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆరే స్వయంగా స్పందిస్తుండటంతో ఈ అంశంలో మాట్లాడకపోవడమే ఉత్తమమని మంత్రులు, పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఆర్టీసీలో 5100 ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపినట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది తన ఒక్కడి నిర్ణయం కాదని, మంత్రిమండలి సమిష్టి నిర్ణయమని కూడా సీఎం స్పష్టం చేశారు. దీంతో క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు మంత్రులను ఈ అంశంపై నిలదీయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు తాజాగా నిర్ణయించాయి. తాజాగా ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును, పరకాలలో ఎమ్మెల్యే ధర్మారెడ్డిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారు స్పందించలేదు.మంత్రుల కార్యక్రమాలకు ఆర్టీసీ కార్మికులు అడ్డుతగలకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆర్టీసీలో బలమైన నేషనల్ మజ్దూర్ యూనియన్ నుంచి చీలిపోయి టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ యూనియన్‌కు వ్యవస్థాపక గౌరవ అధ్యక్షునిగా టి హరీశ్‌రావును ఎన్నుకుంది. అయితే హరీశ్‌రావు ఒకవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలోనే తాను అధ్యక్షునిగా ఉన్న టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘమే గత ప్రభుత్వ హయాంలో ఒకసారి సమ్మెకు నోటిసు ఇచ్చింది. ఇది తనకు ఇబ్బందికరంగా మారడంతో మంత్రి హరీశ్‌రావు టీఎంయు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో టీఎంయుకు టీఆర్‌ఎస్‌తో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. గతంలో తమ సంఘానికి హరీశ్‌రావు అధ్యక్షునిగా ఉండటం వల్లనే సమ్మెపై స్పందించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తన మౌనమే సమాధానంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావే స్పందించడానికి సిద్ధంగా లేనప్పుడు తామేంతా? అన్నట్టుగా ఇతర మంత్రులు, పార్టీ సీనియర్లు వౌన వ్రతం పాటిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ స్పష్టమైన వైఖరితో ఉండటంతో స్పందించి ఆగ్రహానికి గురికావడం ఎందుకని వ్యూహాత్మక వౌనాన్ని మంత్రులు పాటిస్తున్నారు.