గుంటూరు, నవంబర్ 12, (way2newstv.com)
రాజకీయాల్లో ఎంత మంది సీనియర్లు ఉన్నా.. యువత ప్రాధాన్యం లేకుండా ఏ పార్టీ కూడా మనుగడ సాధించే పరిస్థితి లేదు. యువత జెండా కుంటే తప్ప.. నాయకులు మైకు పట్టుకునే పరిస్థితి నేటి రాజకీయాల్లో లేదు. రాజకీయాల్లో ఏ పార్టీ కార్యక్రమాలు సక్సెస్ సాధించాలన్నా.. యువతదే ప్రధాన పాత్ర. ముఖ్యంగా యువ శక్తి ఎక్కువగా ఉన్న ఏపీ వంటి రాష్ట్రాల్లో వీరిదే కీలక పాత్ర. దీంతో రాజకీయాల్లో పార్టీ ఏదైనా కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో పార్టీలో పదవులతో పాటు.. అధికారంలోకి వచ్చాక కూడా యువతకు ప్రాధాన్యం పెంచుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ విషయంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఫెయిలయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
టీడీపీ వైపు చూడని యువత
యువతను చంద్రబాబు అధికారంలో లేని సమయంలో వాడుకుని, అధికారం వచ్చాక పక్కన పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నా యి. 2004, 2009 రెండు సార్లూ టీడీపీ అధికారం కోల్పోయింది. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీకి తీవ్రమైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వీటిని తట్టుకుని పార్టీని నిలబెట్టే విషయంలో చంద్రబాబుకు సీనియర్ నాయకుల కన్నా కూడా యువతే ప్రధానంగా సాయం చేశారనే విషయంలో సందేహం లేదు. అయితే, చంద్రబాబు 2014లో అధికారంలోకివచ్చాక. ఈ యువతకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదన్నదీ వాస్తవం. మంత్రివర్గంలో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ .. సీనియర్లకు మాజీ మంత్రులకే అవకాశం ఇచ్చుకున్నారు తప్పితే.. తనను అధికారంలోకి తీసుకురావాడంలో అహరహం శ్రమించిన యువతను మాత్రం పక్కన పెట్టారనే వ్యాఖ్యలు నిజమే.ఇంకా చెప్పాలంటే పార్టీ కోసం కష్టపడిన ఒకరిద్దరు యువ నేతలను పక్కన పెట్టి ఎన్నికలకు ముందు ఇతర పార్టీల్లో అధికారం అనుభవించి.. అప్పటికప్పుడు పార్టీలు మారిన వారికి పెద్ద పీట వేశారు. దీంతో వాళ్లంతా వాళ్లతో పాటు వచ్చిన వారిని అందలం ఎక్కించి.. అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన యువతను పక్కన పెట్టేశారు. ఒక వేళ దేవినేని అవినాష్ వంటి ఒకరిద్దరికి అవకాశం ఇచ్చినా.. వారు టీడీపీలో సంస్థాగతంగా పనిచేసిన అనుభవం కానీ, పార్టీని అంటిపెట్టుకున్న నేపథ్యం కానీ లేనివారు కావడం గమనార్హం.అదే సమయంలో యువ కోటాలో ఇంకెవరూ లేరు.. పనికిరారు అన్నట్టుగా.. తన కుమారుడిని అర్ధంతరంగా ఎమ్మెల్సీని చేసి, మంత్రిని చేసుకున్నారు. ఇది కూడా పదవులు ఆశించిన యువత కు పెను విఘాతంగా మారిపోయింది. దీంతో ఈ ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగానే టీడీపీపై పడింది. యువతను దూరం చేసుకున్న చంద్రబాబు అధికారానికి కూడా దూరమయ్యారు. ఎన్నికల్లో కూడా వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన యువ నాయకులకు మాత్రమే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు తప్ప.. పార్టీలో నిలదొక్కుకున్న యువ నేతకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.అయితే, దీనికి భిన్నంగా వైసీపీలో అధినేత జగనే యువ నాయకుడు కావడంతో మెజారిటీ స్థానాలను యువతకే కట్టబెట్టారు. యువతను ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకునేలా తన మంత్రి వర్గంలోనూ అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి తదితర యువ నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా ఇతర నామినేటెడ్ పదవుల్లోనూ యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాం బాబుకు ఏకంగా అత్యంత కీలకమైన ఏపీపీఎస్సీ బోర్డు సభ్యునిగా అవకాశం కల్పించారు. ఈస్ట్ గోదావరికి చెందిన మరో యువ నేత చల్లా మధుసూదన్ ను స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన జగన్ .. తాను యువ పక్షపాతినని నిరూపించుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీలో కన్నా కూడా వైసీపీలోనే యువతకు ప్రాధాన్యం పెరుగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.మరోవైపు జనసేన ఎలాంటి ఫలితాలు సాధించినా ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత పవన్‌కు సైతం యూత్ క్రేజ్ ఉంది. పోనీ చంద్రబాబుతో పోలిస్తే జగన్, పవన్ యువకులు అనుకున్నా.. ఇటు బాబు తనయుడు లోకేష్ కూడా యువకుడే. ఆయనకు అసలు యూత్‌లో ఏ మాత్రం క్రేజ్ లేదు. ఇంకా చెప్పాలంటే లోకేష్ కంటే చంద్రబాబుకే కాస్తలో కాస్తంత యూత్ క్రేజ్ ఉంది. భవిష్యత్తులో అయినా చంద్రబాబు యూత్‌ను ఆకర్షించే విషయంలో దృష్టి పెట్టకపోతే పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే.