కాకతీయ పాలక మండలిపై నేతల అసహనం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాకతీయ పాలక మండలిపై నేతల అసహనం

వరంగల్, నవంబర్ 14, (way2newstv.com)
కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) కమిటీలపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘కుడా’ చైర్మన్‌ పదవిపై ఎప్పుడో సస్పెన్స్‌ వీడినా.. పాలకమండలి, సలహా మండలిలో తమ అనుచరులకు అవకాశం కల్పించకపోవడంపై కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది. మూడు జిల్లాలు, 19 మండలాలు, 181 గ్రామాలకు ‘కుడా’ విస్తరించింది. అలాంటి కీలకమైన కమిటీలలో కొందరు ఎమ్మెల్యేలు సూచించిన పేర్లనే పరిగణలోకి తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ‘అసలు మేమున్నామా.. లేమా..’ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన సభలో తన మనసులోని మాట బయట పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. 
కాకతీయ పాలక మండలిపై నేతల అసహనం

లేఔట్లు, భూ లావాదేవీలు, భవన నిర్మాణాలపై ‘కుడా’ అనుమతులు తప్పనిసరి కాగా, నిధుల కేటాయింపు, కమిటీలలో మాత్రం హుస్నాబాద్, హుజూరాబాద్‌ నియోజకవర్గాలకు ప్రాధాన్యత విషయంలో మిగతా ప్రజ్రాప్రతినిధులు, సీనియర్‌ నేతల నుంచి అసంతృప్తి వ్యకమవుతోంది. 15 మంది సలహా మండలి కమిటీలో వరంగల్‌ ట్రైసిటీకి సంబంధించిన ఉద్యమకారులు, సీనియర్లకు అవకాశం దక్కలేదన్న నిరాశ కొందరిలో వ్యక్తమవుతోంది. పది రోజుల క్రితం ప్రకటించిన ‘కుడా’ కమిటీలో పాలకమండలి చైర్మన్‌ పదవి మరోసారి మర్రి యాదవరెడ్డికే దక్కింది. పాలకవర్గం, సలహా మండలిని సైతం ‘కుడా’ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రి, ఇతర సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వేస్తారు. ఈసారి కూడా అదే జరిగిందని భావించారు. అయితే కమిటీల విషయంలో నెమ్మదిగా అసంతృప్తిరాగం వినిపిస్తోంది. పాలకవర్గంలో పది మందికి అవకాశం కల్పించారు. వాస్తవానికి ‘కుడా’ పరిధిలో వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ జిల్లాల్లోని 19 మండలాలు, ఏడు నియోజకవర్గాలు, 181 గ్రామాలు వస్తాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలతో పాటు హుజూరాబాద్, హుస్నాబాద్‌ నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అంటున్నారు.అయితే మర్రి యాదవరెడ్డి చైర్మన్‌గా, మునిసిపల్‌ కమిషనర్‌ వైస్‌ చైర్మన్‌గా, వరంగల్‌ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపనేని నరేందర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్‌ టి.రాజయ్య, మరో ముగ్గురు అధికారులను సభ్యులుగా చేర్చారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం కమలాపూర్, హుస్నాబాద్‌ నియోజకవర్గం భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వొడితెల సతీష్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలకమండలిలో ఈ ఇద్దరికీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా చేర్చకపోగా.. వారి అనుచరులకు కమిటీలో అవకాశం ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. ‘కుడా’ సలహామండలిలో 15 మందిని సభ్యులుగా నియమించారు. ఈ సభ్యుల ప్రతిపాదనల్లోనూ ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కోటాలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు సూచించిన కార్యకర్తలకే అవకాశం కల్పించారు. అందులో మాడిశెట్టి శివశంకర్, దొంతి రవీందర్‌రెడి, బొర్ర ఐలయ్య, నక్క లింగయ్య యాదవ్, మోడెం ప్రవీన్, ఎలుగం శ్రీనివాస్, గులాం సర్వర్‌(మున్నా), ఊకంటి వనంరెడ్డి, చిర్ర రాజుగౌడ్, నన్నబోయిన రమేష్‌యాదవ్, భూక్యా శంకర్‌నాయక్, ఆకుల కుమార్, బిల్ల యాదగిరి, ఎ.రవీందర్, వీరగొని రాజ్‌కుమార్‌ ఉన్నారు. ఇందులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేష్‌ నలుగురి చొప్పున, ఎమ్మెల్యేలు నన్నపనేని నరెందర్‌ ముగ్గురు, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్‌ టి.రాజయ్య తలా ఇద్దరి పేర్లను సిఫారసు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ‘అసలు మేమున్నామా.. లేమా.. పూర్వ కరీంనగర్‌ జిల్లా నుంచి విలీనమైన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాలను అధికారులు విస్మరిస్తున్నారు.. మంత్రి, ఎమ్మెల్యే ఉన్నారన్న విషయం మరచిపోతున్నారు’ అంటూ హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ ఎల్కతుర్తి సభలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధులు, సీనియర్లలోనూ ఈ చర్చ ఇప్పటికే జరుగుతోంది.