కర్నూలు, నవంబర్ 8, (way2newstv.com)
రెడ్డి రాజశేఖరరెడ్డి. రాయలసీమలో ప్రత్యేకంగా తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ నాయకుడు. అయితే, ఆయన రాజకీయంగా వేసిన అడుగులు ఆయన ఉనికికే ప్రమాదంగా మారాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. సీనియర్ నేత అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో ప్రస్థానం ప్రారంభించారు. పాణ్యం నియోజకవర్గం నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి 1994, 1999 ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే, రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యంగా తెలంగాణ విడిపోతుందనే సంకేతాలు వచ్చిన సమయంలో చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూ.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
అయ్యో... బైరెడ్డి..
అంతేకాదు, రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అనే సంస్థను స్థాపించిన సీమ జిల్లాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు. ఇది సాధ్యం కాకపోవడంతో రాజధానిని సీమ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ క్రమంలోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సాగించాడు. అయితే, 2014 ఎన్నికలకు ముందు వివిధ కేసుల నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జైలు కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆయన కుమార్తె రంగ ప్రవేశం చేసి.. తండ్రి తరఫున పోరాటం ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో ఆమె స్వయంగా ఇండిపెండెం ట్‌గా బరిలో నిలిచి పోటీ చేసింది. అయితే, ఓడిపోయింది.ఇక, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన పంథాలోనే సాగారు. ఆ తర్వాత ఆయన టీడీపీతోనూ విబేధించారు. ఇక ఈ యేడాది ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీకి సపోర్ట్ చేశారు. ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఇటీవల బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీతో చెలిమికి సిద్దమవతున్నారు. అయితే, ఓటు బ్యాంకులేని బీజేపీలో చేరడం వల్ల ప్రయోజనం ఏంటనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బైరెడ్డికి వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. అయితే, ఆయన దీనిని తిరస్కరించి మరీ.. బీజేపీకి దగ్గరవుతున్నారు. ఫలితంగా మంచి అవకాశం చేజార్చుకున్నారు.అయితే, అదే సమయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న కొడుకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీలో చేరి నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్ పదవిని సొంతం చేసుకున్నాడు. తన కుటుంబ వారసత్వంగా తన కుమార్తెను రాజకీయంగా హైలెట్ చేయాలని బైరెడ్డి చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమయ్యాయి. ఇక ఇప్పుడు అన్న కుమారుడు సిద్ధార్థరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలోనే సంచలనాలతో దూసుకుపోతున్నాడు. నందికొట్కూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్‌ను రెండో ప్లేస్‌కు నెట్టేసి మరీ సిద్ధార్థ తన సత్తా చాటుతున్నాడు. దీంతో ఆయనకు వైసీపీలో పదవులు కూడా దక్కే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ సైతం సిద్ధార్థరెడ్డికి ప్రయార్టీ ఇస్తూ అతడినే పార్టీ ఇన్‌చార్జ్‌గా కూడా నియమించారు.ఇక సిద్ధార్థ్‌కు కర్నూలు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది.ఇక, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి పట్టున్న మరో నియోజకవర్గం పాణ్యంలో కూడా కాటసాని, గౌరు ఫ్యామిలీలు బలంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ కూడా బైరెడ్డికి ఛాన్స్ లేదని అంటున్నారు పరిశీలకులు. కాటసాని ఆరో విజయడంతో అక్కడ తిరుగులేని నేతగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరినా ఆయనకు కొత్తగా ఒరిగిందేమి లేదు. కూతురును రంగంలోకి దింపాలని చూసినా.. ఆమె కూడా సక్సెస్ అందుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో ఇటు ఎదుగుబొదుగు లేని పార్టీలో చేరాలని అనుకోవడం, తనకు పట్టున్న నియోజకవర్గాల్లో మరింత పట్టున్న నాయకులు ఉండడంతో ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫ్యూచర్ ఏంటనే ప్రశ్న తెరమీదికి వస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి .