రెంటికి చెడ్డ రేవడిలా దగ్గుబాటి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెంటికి చెడ్డ రేవడిలా దగ్గుబాటి

ఒంగోలు, నవంబర్ 4, (way2newstv.com)
కాశం జిల్లా ప‌ర్చూరు మాజీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ పెద్దల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు రాజ‌కీయ భ‌విత‌వ్యం ఏంటి? ఇప్పుడు ఆయన ఎందుకు రాజ‌కీయంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు ? అస‌లు వైసీపీలో ఇంత‌గా ఆయ‌న‌ను టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు వ‌చ్చింది ? వంటి కీల‌క ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్రను సొంతం చేసుకున్న ద‌గ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు త‌ర్జన భ‌ర్జన‌లో మునిగి పోయారు. వైసీపీలో ఉండాలా ? వ‌ద్దా అనేది ఒక విష‌యం అయితే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌ను స‌మ‌ర్ధించే గ‌ళాలు, ఆయ‌న‌కు జై కొట్టే చేతులు కూడా పెద్దగా క‌నిపించ‌క‌పోవ‌డం ప్రధానంగా చ‌ర్చకు వ‌స్తోంది.=2004 ఎన్నిక‌ల‌కు ముందు ఈ కుటుంబం గుండుగుత్తుగా కాంగ్రెస్‌లోకి చేరిపోయింది. 
రెంటికి చెడ్డ రేవడిలా దగ్గుబాటి

ఈ క్రమంలోనే వైఎస్ ఆశీర్వాదంతో ద‌గ్గుబాటి స‌తీమ‌ణి పురందేశ్వరి బాప‌ట్ల నుంచి పోటీ చేయ‌డం గెలుపు గుర్రం ఎక్కి కేంద్రంలో మంత్రి ప‌ద‌విని సంపాయించుకోవడం తెలిసిందే. 2009 ఎన్నిక‌ల్లో పురందేశ్వరి బాప‌ట్ల ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో వైజాగ్ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించ‌గా.. ద‌గ్గుపాటి వెంకటేశ్వరరావు మ‌రోసారి ప‌ర్చూరు నుంచే గెలిచారు. ఇక 2019 ఎన్నిక‌ల నాటికి పురందేశ్వరి బీజేపీలో ఉండ‌గా…. భ‌ర్త వైసీపీలోకి వెళ్లారు. ఈ ఎన్నిక‌ల్లో ఇద్దరూ ఓడిపోయారు. ఆ మాట‌కు వ‌స్తే పురందేశ్వరి 2014 ఎన్నిక‌ల‌కు ముందే బీజేపీలోకి జంప్ చేసి ఆ పార్టీ త‌ర‌పున రాజంపేట‌లో ఓడిపోయారు.ఇక తాజా ఎన్నిక‌ల‌కు ముందు కుమారుడితో స‌హా వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు ఓట‌మి బాట‌లో ప‌డ్డారు. దీంతో ఆయ‌న మౌనం వ‌హించారు. నియోజ‌వ‌క‌ర్గంలో టీడీపీ నేత‌గా ఏలూరి సాంబ‌శివ‌రావు పుంజుకున్నారు. అయితే, ద‌గ్గుబాటి వెంకటేశ్వరరావవు కూడా అదేస‌మ‌యంలో ఓడిపోయినా.. చ‌క్రం తిప్పి ఉంటే ప‌రిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఆయ‌న అలా చేయ‌డం మానేసి సొంత వ్యాపారాలు, వ్యవ‌హారాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఓడినా ఆయ‌న ఎక్కువుగా హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావ‌డం కూడా వైసీపీ వ‌ర్గాల‌కు మింగుడు ప‌డ లేదు. దీంతో ద‌గ్గుబాటి వెంకటేశ్వరరావు అనుచ‌ర గ‌ణం క‌కావిక‌ల‌మైంది.అస‌లు ఎన్నిక‌ల్లో ఓడని ద‌గ్గుపాటి ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి ఆయ‌న అవుట్ డేటెడ్ పాలిటిక్స్ కూడా ఓ కార‌ణం. ఇప్పుడు ఓడిపోయాక కూడా ఆయ‌న అదే పంథాలో ముందుకు వెళుతుండ‌డం ఎవ్వరికి న‌చ్చడం లేదు. అయితే, ఇప్పుడు వైసీపీ నుంచి ఉంటే మొత్తం వైసీపీలో లేదా బీజేపీలో అంటూ ష‌ర‌తు విధించారు. దీంతో ద‌గ్గుబాటి ప‌రిస్థితి త‌ల‌కిందులు అవుతోంది. వైసీపీ అధికారంలో ఉంది. పిలిస్తే ప‌లికేందుకు సీఎం జ‌గ‌న్ అందుబాటులో ఉన్నారు. కానీ, కేంద్రంలో బీజేపీ ఉంది. త‌న స‌తీమ‌ణి బీజేపీలో ఉన్నారు. ఆమె ఏదైనా ప‌ద‌వి వ‌స్తే.. ఇబ్బంది లేదు. కానీ, ఇప్పటి వ‌ర‌కు రాలేదు.జ‌గ‌న్ మాత్రం ద‌గ్గుబాటి వెంకటేశ్వరరావుని పొమ్మన కుండా పొగ పెట్టే ప్రయ‌త్నం చేస్తున్నారు. ఇక పురందేశ్వరికి ఏదైనా ప‌ద‌వి వ‌స్తుంద‌నే ఆశ‌తో మొత్తం గుండుగుత్తుగా బీజేపీలోకి చేరితే.. వైసీపీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్పడుతుంది. పైగా స్థానికంగా బీజేపీకి అంత బ‌లం కూడా లేదు. ఈ స‌మీక‌ర‌ణ‌ల మ‌ధ్య ద‌గ్గుబాటి వెంకటేశ్వరరావు రాజ‌కీయం ర‌స‌కందాయంగా మారింది. ఏదేమైనా పార్టీలు మారడం, అనుచ‌రుల‌ను, స‌న్నిహితుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, వ్యూహాత్మకంగా టీడీపీకి ఎదురు నిలిచే చ‌ర్యలు చేప‌ట్టక పోవ‌డం… ప్రస్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా దూకుడు రాజ‌కీయాలు.. ప్రజ‌ల్లోకి చొచ్చుకుపోక‌పోవ‌డం వంటివి ఇప్పుడు ద‌గ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయం కృత అప‌రాధమే అంటున్నారు.