ఒంటరైన శివసేన... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒంటరైన శివసేన...

ముంబై, నవంబర్ 13 (way2newstv.com)
మహారాష్ట్రలో శివసేన అటూ ఇటూ కాకుండా పోయింది. తన చిరకాల మిత్రుడు బీజేపీని దూరం చేసుకున్నా లబ్ది పొందలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో గవర్నర్ ఎన్సీపీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శివసేన ఆ ప్రభుత్వంలో భాగస్వామి కావాల్సి వచ్చింది. శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తొలుత శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ కాంగ్రెస్ ఎటూ తేల్చి చెప్పక పోవడంతో శివసేన తనకు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోలేకపోయింది.హిందుత్వ పార్టీ అయిన శివసేనకు కాంగ్రెస్ నేరుగా మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. అదే ఎన్సీపీతో అయితే కాంగ్రెస్ మద్దతివ్వడమే కాకుండా ప్రభుత్వంలో కూడా చేరే అవకాశముంది. 
ఒంటరైన శివసేన...

మహారాష్ట్రలో ఉన్న 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరాలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే శివసేన వారి ప్రభుత్వంలో చేరాల్సి ఉంటుంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే నేరుగా సోనియా గాంధీతో ఫోన్ లో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. శివసేన అధినేత బాల్ ధాక్రే బతికున్నప్పుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ ఎన్సీపీని స్కౌండ్రల్స్ పార్టీగా అభివర్ణించారు. వాజ్ పేయి ప్రభుత్వాన్ని కూలదోసిన ఎన్సీపీపై బాల్ థాక్రే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.శివసేన, ఎన్సీపీ, కాంగ్రెసుల కలయిక ఒక విచిత్ర పరిణామమే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేందుకు ఇదొక తాజా తార్కాణం. పరస్పర అవసరాల ప్రాతిపదికపైనే ఏర్పాటయ్యే సంకీర్ణం మనుగడ ఎంతకాలమనేది ప్రశ్నార్థకమే. ఆదిలోనే హంసపాదులా 2020కి ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుందంటూ కాంగ్రెసులో ఒక వర్గం పేర్కొంటోంది. పంతం, పట్టుదల , పరస్పర అసహనం , పగ సాధించాలనే కక్ష ప్రధాన ముడిసరుకులుగా సర్కారు కొలువు తీరవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా వేశారు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు.బీజేపీతో శివసేన మైత్రి 35 ఏళ్లనాటిది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచింది. దీనికి ప్రధాన కారణం సైద్ధాంతికమైన ఏకతాసూత్రం. హిందూత్వం, మరాఠా ఆత్మాభిమానం ప్రాతిపదికగా ఒక రాజకీయపక్షంగా ఆవిర్భవించింది శివసేన. హిందూత్వ విషయంలో సామీప్యత కలిగిన పార్టీగా బీజేపీ తో చెలిమి చేసింది. తద్వారా రెండు పార్టీలు మహారాష్ట్రలో బలపడుతూ వచ్చాయి. ఎన్నికల్లో అనేక సందర్భాల్లో పరస్పరం విభేదించుకున్న ఘట్టాలకూ కొదవ లేదు. ఎప్పటికప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీనే కొంత తగ్గుతూ సర్దుబాటు ధోరణి కనబరుస్తూ వచ్చింది. 2014లో బీజేపీ తన బలాన్ని అనూహ్యంగా పెంచుకోగలిగింది. శివసేనను తోసిరాజంటూ సొంతంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో శివసేన దాంతో కలవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఉప్పు నిప్పుగానే ఉంటూ వచ్చాయి. ఎన్సీపీ, కాంగ్రెసులు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో విడిపోతే చెడిపోతామనే రాజకీయ స్ప్రుహతో శివసేన, బీజేపీలు తాజాగా కలిసే పోటీ చేశాయి. ప్రజాతీర్పు అనుకూలంగానే వచ్చినా ఆధిపత్య రాజకీయాలతో రెండు పార్టీలు వర్గ స్థాయికి దిగజారి సర్కారు ఏర్పాటులో మాత్రం పొత్తును కాదనుకున్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించడంతో శివసేన ఎటూ కాకుండా పోయింది.