అనంతలో టీడీపీ వర్సెస్ వైసీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంతలో టీడీపీ వర్సెస్ వైసీపీ

అనంతపురం, నవంబర్ 1, (way2newstv.com)
రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంటున్న తరుణంలో అనంతపురం జిల్లాలోనూ రెండు పార్టీల మధ్య గొడవలు భగ్గుమంటున్నాయి. ఇసుక విధానం, ప్రభుత్వ పథకాల అమలులో వైఫల్యాలపైనే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారని, అయినా జిల్లా పోలీసులు నోరు మెదపకుండా అధికార పార్టీకి కొమ్ము కాస్తూన్నారంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ నేత కురుబ నాగరాజు ఇంటి ముందు వైసీపీ నాయకులు బండలు పాతడం పెను వివాదానికి దారి తీసింది. ఇది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. 
అనంతలో టీడీపీ వర్సెస్ వైసీపీ

ఈ ఘటనపై గత మూడు రోజులుగా గ్రామంలో గొడవలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నాగరాజు ఇంటి వద్ద పరిస్థితిపై ఆరా తీసేందుకు మాజీ ఎంపీ జేసీ.దివాకర్‌రెడ్డి  వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యామినీబాల, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై జేసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంలో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా ఇప్పటికే రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, విప్ కాపు రామచంద్రారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇసుక అక్రమ రవాణా, అక్రమ మైనింగ్‌తో దోపిడీ చేస్తుంటే అడ్డుకున్న ప్రజలపైనే కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ గత కొద్ది రోజుల క్రితం ఎస్పీకి కాలవ శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. పెనుకొండలో మంత్రి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బీకే.పార్థసారథి మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక తాడిపత్రి, కదిరి, ధర్మవరంలో కూడా వైసీపీ, టీడీపీ మధ్య ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్ 13న చంద్రబాబు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమవుతోంది.