జోరుగా సీతాఫలాల విక్రయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జోరుగా సీతాఫలాల విక్రయాలు

కరీంనగర్, నవంబర్ 14, (way2newstv.com)
జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, మద్దూరు, లింగాలఘనపురం, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల తదితర మండలాల నుంచి పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వద్ద ఉన్న మార్కెట్‌కు సీతాఫలాలను కూలీలు తీసుకొస్తున్నారు. నిత్యం జనగామ మార్కెట్‌లో రూ. రెండు లక్షలకు పైగా వ్యాపారం సాగుతుంది. జనగామ నుంచి హైదరాబాద్, మిర్యాలగూడ, కోదాడ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ, రాజ మండ్రి, విజయనగరం, ఒంగోలు, గుంటూరుతో పాటు ఢిల్లీ, ముంబయి రాష్ట్రాలకు సీతాఫల్‌ పండ్లను ఎగుమతి చేస్తున్నారు. విజయవాడకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్‌లో ఒక్కో గంపను రూ.150 నుంచి రూ.300 వరకు కొనుగోలు చేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యాపారులు చిన్న, పెద్ద సైజు పండ్లను వేరుచేసి ఎగుమతి చేస్తున్నారు. 
జోరుగా సీతాఫలాల విక్రయాలు

విజయవాడలో పెద్ద సైజులలో ఉన్న డజను పండ్లకు రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటే హైదరాబాద్‌లో రూ.150కి పైగా డిమాండ్‌ ఉంది. జనగామ నుంచి ప్రతీ రోజు పది వాహనాలకుపైగా సీతాఫల్‌ పండ్లను విజయవాడ కేంద్రంగా తరలిస్తున్నారు. ఆంధ్రప్రాంతానికి చెందిన ఏజెంట్లు జనగామలోనే మకాం వేసి రోజువారీగా కొనుగోలు చేస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యే సీతాఫల్‌ మార్కెట్‌లో రాత్రి వరకు క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలోనే అనేక గ్రామాల్లో రోజువారి కూలీలతో పాటు రైతులు, యువకులు, అన్ని వర్గాల వారు కుటుంబ సమేతంగా తెల్లవారు జాము నాలుగు గంటలకే అడవికి వెళ్లి సీతాఫల్‌ పండ్లను సేకరిస్తున్నారు. నెలరోజులుగా జోరుగా సాగుతున్న ఈ సీజన్‌ మరో 20 రోజులకు పైగానే ఉంటుం ది. తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా దిగుబడినిచ్చే ప్రాంతం జనగామ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతానికి చెందిన రైతులు మామిడితోటలకు బదులుగా సీలాఫల్‌ తోటలను సాగు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు.ఆకులు, బెరడు, వేరు ఇలా అన్ని భాగాలను అనేకరకాల వ్యాధుల నివారణలో వినియోగిస్తారని నమ్మకం. వీటి ఆకులకు మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు అధికబరువు తగ్గించే గుణం ఉందని నమ్మకం. ఆకుల కషాయం జలుబును నివారిస్తుందని పెద్దలు అంటుంటారు. పండ్ల నుంచి నుంచి కెరోటిన్, థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్‌–సి వంటి గుణాలు కలిగిన విటమిన్లు సమృద్ధిగా వస్తాయి. పండును రసం రూపంగా కాకుండా నేరుగా తింటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతూ జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. పండు గుజ్జును తీసి రసంలా తయారు చేసి పాలల్లో కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుందని పెద్దలు చెబుతుం టారు. ఇందులో ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు, ఎముకల పరిపుష్టికి దోహదం చేస్తాయి. మలబద్ధకంతో బాధపడే వారికి ఈ పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆకుల్లోని హైడ్రోసైనిక్‌ ఆమ్లం చర్మసంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకులను మెత్తగా నూరి కొంచెం పసుపు కలిపి మానని గాయాలపై రాస్తే తగ్గుముఖం పడుతుంది. ఆకులను మెత్తగా నూరి బోరిక్‌పౌడర్‌ (క్యారం బోర్డు పౌడర్‌)ను కలిపి మంచం, కుర్చీల మూలాల్లో ఉంచితే నల్లుల బెడద తప్పుతుంది