విజయవాడ, నవంబర్ 13, (way2newstv.com)
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశలు వదిలేసుకున్నారు. బుజ్జగింపులు, భరోసాలు పనిచేయవని, తాను ఎంత ప్రయత్నించినా వల్లభనేని వంశీ వెనక్కు రారని అర్ధమైపోయింది. అందుకే వంశీతో పాటు, నియోజకర్గంలోని మొత్తం కేడర్ జారిపోకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బయటి నుంచి ఐదుగురు నాయకుల్ని తెచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ, స్థానిక సంస్థల ఎన్నికలకు నియోజకవర్గంలోని కార్యకర్తల్ని సిద్ధం చేయడం వంటి బాధ్యతల్ని వాళ్ల భుజాలపై ఉంచారు. కొనకళ్ల నారాయణ, ముద్దరబోయిన వెంకటేశ్వర్లు, వర్ల రామయ్య, బచ్చుల అర్జునుడు, గద్దె అనురాధలతో నియమించిన కమిటీకి గన్నవరం బాధ్యతలు అప్పగించారు.
దిద్దుబాటు చర్యలో విజయవాడ టీడీపీ
వల్లభనేని వంశీ పార్టీ గడప దాటకుండా చూసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కానీ అవేమీ ఫలించలేదు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు వల్లభనేని వంశీ తనకు వాట్సాప్ సందేశం పంపడంతోనే చంద్రబాబుకి సీన్ అర్ధమైపోయింది. చివరి నిమిషం వరకు పోరాడే లక్షణం ఉన్న చంద్రబాబు… వల్లభనేని వంశీ వెళ్లకుండా ఆపేందుకు చేయని ప్రయత్నం లేదు. వంశీతో మాట్లాడి నచ్చజెప్పే బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలకు అప్పగించారు. వల్లభనేని వంశీని బుజ్జగించేందుకు పెద్దలిద్దరూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.తన ఇబ్బందుల్ని ఏకరవు పెట్టిన వల్లభనేని వంశీ, తెలుగుదేశంంలో మాత్రం కొనసాగలేనని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇటీవల నిర్వహించిన తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశానికి వల్లభనేని వంశీ డుమ్మా కొట్టడంతో… అతను ముమ్మాటికీ వెనక్కు రాడని బాబుకి అర్ధమైపోయింది. వల్లభనేని వంశీ ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరకపోయినా, ఆయన వైకాపాలోనే చేరతాడని, అదును కోసం చూస్తున్నాడని ఎవర్ని అడిగినా చెబుతారు. ఆ విషయం చంద్రబాబుకీ తెలుసు. అందుకే నియోజకవర్గంలో పార్టీ అనాథ కాకూడదన్న ఉద్దేశంతో కమిటీ వేశారు.చంద్రబాబు సోమవారం రాత్రి గన్నవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వల్లభనేని వంశీపై వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టిన వెంటనే పార్టీ పరంగా పూర్తి అండదండలు అందించామని గుర్తు చేశారు. కేశినేని నాని, కొనకళ్ల నారాయణలను వంశీ వద్దకు పంపి సంఘీభావం తెలిపామని, పార్టీపరంగా వెన్నంటి నిలిచామని గుర్తు చేశారు. వల్లభనేని వంశీ వెళ్లిపోయినా నియోజకవర్గంలో పార్టీ బలహీన పడరాదని, పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు పక్కాగా పూర్తి చేయాలని చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు.