విజయవాడ, నవంబర్ 22, (way2newstv.com)
రాజకీయ స్నేహాలు ఎపుడు మొదలవుతాయో,మరెపుడు ముగుస్తాయో దేవుడికే ఎరుక. ఏపీలో చంద్రబాబు ఉన్నంతవరకూ ఆయన్నే టార్గెట్ చేసిన ఏపీ బీజేపీ జగన్ సీఎం కాగానే యూటర్న్ తీసుకుంది. వెంటనే జగన్ మీద పడిపోతూ పెడబొబ్బలే పెడుతోంది. ఆరు నెలలైంది బీజేపీకి వచ్చిన పొలిటికల్ మైలేజ్ ఎంతో తెలియదు కాని కమల విలాపాల జోరు మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి అండగా ఉంటామని మాట అయితే ఇచ్చింది. ఆచరణలో మాత్రం చేసింది శూన్యం. జగన్ పలు మార్లు ఢిల్లీకు వెళ్ళి వచ్చాక చివరికి విషయం అర్ధమై టూర్లు తగ్గించుకున్నారని అంటారు. ఏపీలో నవరత్నాలకు భారీ ఎత్తున నిధులు కావాలి.
ఏపీ బీజేపీ యూ టర్న్ వెనుక.....
అయితే దానికి కేంద్రం సాయం చేయదు, అమరావతి రాజధాని ఊసు లేదు, పోలవరం నిధులు అంతకంటే రావు, విభజన హామీలకు దిక్కు లేదు, బుందేల్ ఖండ్ ప్యాకేజ్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇదీ పరిస్థితి.ఈ మధ్యనే జరిగిన ఓ ముచ్చట చూస్తే ఓ సాధారణ ఎంపీకి అమిత్ షా అపాయింట్ మెంట్ లభించింది. అదే టైంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ కేంద్ర హోం మంత్రిని కలుసుకోవాలంటే రెండు రోజులు పట్టింది. అపుడే ఏవో సంకేతాలు రాజకీయం అర్ధమైన వారికి వచ్చేశాయి. ఏపీలో జగన్ సర్కార్ పై సీత కన్ను వేస్తున్నారని కూడా ప్రచారమూ సాగింది. మరో వైపు ట్రయల్ కోర్టులో సీబీఐ జగన్ విషయంలో వ్యక్తిగత హాజరు ఇవ్వవద్దు అంటూ గట్టిగా పట్టుపట్టిన వైనాన్ని అంతా చూశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్ సాక్ష్యులను బెదిరిస్తారంటూ సీబీఐ న్యాయవాదులు కోర్టుకు చెప్పినపుడు మరింతగా సంగతులు తెలిశాయని అంటున్నారు.దాంతో జగన్ అభ్యర్ధనను కోర్టు కొట్టేసింది. ఇవన్నీ ఇల్లా ఉంటే తాజాగా జరిగిన అఖిల పక్ష సమావేశంలో చిందంబరాన్ని బెయిల్ మీద పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేలా చూడాలంటూ ఆ పార్టీ నేత గులాం నబీ అజాద్ చేసిన విన్నపానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి అభ్యంతరం చెప్పినట్లుగా వార్తల్లో వచ్చింది. అందరికీ ఒకటే న్యాయం ఉండాలని, నాడు జగన్ జైల్లో ఉన్నపుడు ఎంపీగా ఆయన హక్కులు కాపాడాలని కోరినపుడు యూపీయే సర్కార్ పట్టించుకోని వైనాన్ని విజయసాయిరెడ్డి హోం మంత్రి అమిత్ షా ద్రుష్టికి తెచ్చారట. ఇది సబమైన వాదనే. కానీ షా మాత్రం మీ గొడవ మీరు చూసుకోండి, ఇందులో జోక్యం ఎందుకు అంటూ కసురుకున్నట్లుగా టీడీపీ ఎంపీ కనకమేడల చెబుతున్నారు.అంటే అమిత్ షా ఇలా బాహాటంగా విజయసాయిరెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఇపుడు పసుపు శిబిరంలో పండుగను తెస్తోంది. కేంద్రంలోని పెద్దలకు జగన్ మీద వ్యతిరేక భావం ఏర్పడిందని చెప్పుకుని మురిసిపోతున్నారు. జగన్ కి ఇక బెయిల్ రద్దు, జైలే దిక్కు అంటున్నారు దేవినేని ఉమామహేశ్వరరావులాంటి వారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే జగన్ విషయంలో నాడు యూపీయే కూడా సామదాన బేధ దండోపాయాలు ప్రయోగించింది. ఇపుడు కేంద్రంలోని పెద్దలు కూడా ఏపీ మీద దృష్టి పెట్టి ఉన్నారు. జగన్ ఇక్కడ బలంగా కనిపిస్తున్నారు. ఆయన్ని పక్కకు జరిపితే తప్ప ఏపీ రాజకీయాల్లో దూసుకు పోయేందుకు అవకాశం లేదు అనుకున్నపుడు దేవినేని లాంటి వారి కోరికా తీరుతుందేమో. అదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ లాంటి వారి జోస్యం కూడా ఫలిస్తుందేమో. ఏది ఏమైనా కేంద్రంలోకి బీజేపీకి ఏపీ ఒక రాజకీయ ప్రయోగ శాలగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నా నిధుల విదిలింపు లేదు సరికదా రాజకీయమే చేస్తూ పోతున్నారన్న ప్రచారం గట్టిగా ఉంది. అదే జనం కనుక గట్టిగా నమ్మితే మాత్రం మరో పదేళ్ళైనా ఏపీలో కమల వికాసం జరగదేమో.