పట్టించుకోని వైద్యశాఖ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పట్టించుకోని వైద్యశాఖ

అల్లోపతొ వైద్యం చేస్తున్న ఆయుర్వేద, హోమియో డాక్టర్లు
రంగారెడ్డి, నవంబర్ 14, (way2newstv.com)
రంగారెడ్డి జిల్లాలో శంకర్‌దాదాల వైద్యం యథేచ్ఛగా సాగుతున్నా  జిల్లా వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్‌ షాపులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మెడికల్‌ షాపుల్లో మందులు విక్రయిస్తున్నారు. అలాగే ఆర్‌ఎంపీ, బీఎంపీ, బీఎమ్మెస్‌ వారు రాసిన ప్రిస్క్రిప్షన్‌లకు స్టెరాయిడ్‌ మందులు ఇస్తున్నారు. ఇంతా జరుగుతున్నా డ్రగ్స్‌ అధికారులు కనీసం పర్యవేక్షణ కూడా చేయకపోవడం ఆరోపణలకు తావిస్తోంది.  శంకర్‌దాదాల వైద్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పవిత్రమైన వైద్య వృత్తిని అడ్డుపెట్టుకొని రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. చిన్న రోగాన్ని సైతం పెద్దగా చూపించి రోగులకు మిడిమిడి వైద్యపరిజ్ఞానంతో ట్రీట్‌మెంట్‌ చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 
పట్టించుకోని వైద్యశాఖ

నాడీపట్టే వారంతా వైద్యులేనని నమ్మిన గ్రామీణ ప్రజలు ఆరోగ్యం కోసం వేల రూపాయలను ధారపోస్తున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్‌ఎంపీలు తమకు వచ్చిన విద్యతో రోగులకు వైద్యం చేస్తున్నారు. మరోవైపు పాతకాలపు వైద్యవిద్య హోమియోపతి చదివిన వారు కూడా డాక్టర్లుగా అవతారమెత్తి రోగులకు అల్లోపతి వైద్యం చేస్తుండడం మరోకోణం. వీరితో పాటు ఆయుర్వేదం, యునానీ, న్యాచురోపతి చదివిన వారు కూడా పాలీక్లినిక్‌లు అల్లోపతి వైద్యం అందిస్తున్నారు.  జిల్లాలో సుమారు 200లకు పైగా పాలీకేంద్రాలను ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. భారత పూర్వకాలపు ప్రకృతి వైద్యవిధానంలోని ఆయుర్వేదం, యునానీ, న్యాచురోపతి æవంటి వైద్యం నేటి ఆధునిక కాలంలో ప్రాధాన్యత చాలా తక్కువ. హోమియోపతి వైద్యంలోనూ వివిధ రకాల రోగాలకు వివిధ మూలకాలతో  హోమియోపతి పిల్స్‌ ఇస్తారు. అయితే బీహెచ్‌ఎంఎస్‌ చేసిన వారు కూడా పాలీ క్లినిక్‌లుల బోర్డులు పెట్టి రోగులకు వైద్యం చేస్తుండటం గమనార్హం. హోమియోపతి వైద్యం కోసం వచ్చే వారికి అల్లోపతి వైద్యం చేస్తున్నారు.క్లినిక్‌లో బెడ్లు ఏర్పాటు చేసి స్టెరాయిడ్‌ మందులు, యాంటిబయోటిక్స్‌ గోలీలు, సూదులు ఇస్తున్నారు. ఇంతటితో ఆగకుండా రక్తపరీక్షలు చేస్తున్నారు. బీపీలు, షుగర్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. చదువుకు సంబంధం లేకుండా తమకు తెలిసిన వైద్యపరిజ్ఞానంతో గ్రామీణ రోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. బషీరాబాద్‌ మండల కేంద్రంలోని ఓ వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా పాలీక్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. హోమియోపతి వైద్యం చాటున అల్లోపతి వైద్యం చేస్తున్నారు. మారుమూల గ్రామాల రోగులతో పాటు,  కర్ణాటక నుంచి వచ్చే రోగులకు అల్లోపతి వైద్యం అందిస్తుండటం గమనార్హం.