ముంబై, నవంబర్ 1, (way2newstv.com)
చంద్రబాబుని ఇపుడు వైసీపీ నేతలు సహా సొంత పార్టీ నేతలు కూడా పక్కన తీసిపారేయడానికి కేవలం ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఉంది. అదే ఆయన వయసు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన పార్టీని నడపలేడని, ఆయన నాయకత్వంలో పార్టీకి కొత్త జోష్ రాదని తమ్ముళ్లు సైతం అనుకుంటున్నారు. ఇక ప్రత్యర్ధి వైసీపీ విషయం తీసుకుంటే ఇదే వైఖరితో ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓడాక ఇక మళ్ళీ టీడీపీ కోలుకోలేదని, దానికి కారణం ఆయన వయోభారమని, వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఈ హుషార్, జోరు అసలు ఉండదని జగన్ నుంచి మొత్తం పార్టీ అంతా ఇదే రకమైన అంచనాల్లో ఉన్నారు. ఇపుడు టీడీపేలో అదే పెద్ద చర్చగా ఉంది. ఇక తమ్ముళ్ళు పక్క చూపులు చూడడానికి ఇదే కారణం. కానీ చంద్రబాబుకు ఏమంత వయసు అనే వారూ అదే టీడీపీలో ఉన్నారు.
పవార్ లా ఉండాలని బాబు ఆశ
నిజమే చంద్రబాబు వయసు డెబ్బయ్యేళ్ళు. అయితే ఆయనకు దీర్ఘ వ్యాధులేవీ లేవు. ఇప్పటికీ ఆయన్ మంచి ఫిట్ గా ఉంటారు. ఆహార నియామాల్లో చంద్రబాబుది కచ్చితమైన విధానం. అదే ఆయన్ని డెబ్బైల్లో కూడా ఇరవై ఏళ్ల యువకుడిగా ఉంచుతోందనేవారు ఉన్నారు.తాజాగా దేశంలో జరిగిన రెండు ఎన్నికల ఫలితాలపై ఇపుడు అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా పని అయిపోయిందనుకున్న శరద్ పవార్ మళ్ళీ విజృంభించి మంచి ఫలితాలు రాబట్టారు. ఎన్సీపీకి కొండంత ఆశలు మిగిల్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ ఒక్క నాయకుడు ఇంతలా తిరగలేదు, అనేక సభల్లో ప్రసగించడమే కాదు, జోరు వానలో సైతం పర్యటనలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఆయన పడిన శ్రమకు జనం కూడా తగిన విలువ ఇచ్చారు. ఇంతకీ శరద్ పవార్ వయసు చెబితే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన 78 ఏళ్ళ వయసులో ఈ ఫీట్ చేసి సాధించారు. అంటే చంద్రబాబుతో పోలిస్తే ఆయన ఎనిమిదేళ్ళు పెద్దవాడు. పైగా శరద్ పవార్ కి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మరి ఆయనతో పోల్చుకుంటే చంద్రబాబు అంతకంటే ఎక్కువగా తిరగగలరు, ఏ అనారోగ్యం కూడా లేదు, వయసు కూడా తక్కువే. ఇపుడు చంద్రబాబు మరో అయిదేళ్ళకు ఎన్నికలు జరిగినా కూడా ఇదే విధమైన జోష్ ని చూపిస్తే చాలు ఆయన నెట్టుకురాగలరు అన్న ధైర్యం కూడా కొంతమంది తమ్ముళ్ళలో ఉంది. చంద్రబాబుకు సైతం పవార్, ములాయం, దేవెగౌడ లాంటి సీనియర్లే స్పూర్తిగా కనిపిస్తున్నారట.ఏపీకి సంబంధించి చూస్తే రాజకీయ వాతావరణం ఇప్పటికీ చంద్రబాబుకే అనుకూలంగా ఉందనడంలో సందేహం లేదు. టీడీపీ ఏపీలోని పదమూడు జిల్లాలకు పాకిన పార్టీ, అనేక పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ, పైగా చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, ఎత్తులు మరో నేతకు, పార్టీకి లేవు, ఇక గ్రామ స్థాయి నుంచి పటిష్టమైన నాయకత్వం ఒక్క టీడీపీకే ఉంది. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో నేతలు వెళ్ళిపోయినా క్యాడర్ మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. చంద్రబాబుపై నుంచి నాయకత్వం అందిస్తూ ఉంటే చాలు కొండను సైతం పిండి చేయగల తమ్ముళ్లు ఆ పార్టీలో ఉన్నారు. ఇక నాయకులు గెలిచే పార్టీలోకి ఎటూ వస్తారు. అందుకే చంద్రబాబు పొరాటం అంతా పార్టీని కాపాడుకోవడం మీదనే ఉంచారు. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే చాలు ఆ మీదట కధ మొత్తం అనుకూలంగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తానికి మహారాష్ట్ర పవార్ చంద్రబాబులో సరికొత్త పవర్ నింపాడనుకోవాలి