ఎండమావిగా శ్రీరామ్ సాగర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎండమావిగా శ్రీరామ్ సాగర్

నిజామాబాద్, నవంబర్ 8, (way2newstv.com)
ళేశ్వరం తర్వాత గోదావరిపై అతి పెద్ద ప్రాజెక్టుగా ఉన్న శ్రీరామ్‌ సాగర్‌ రైతులకు భరోసా కలిగించలేక పోతున్నది మూడేండ్ల తర్వాత ఈ ప్రాజెక్టు నిండటంతో గేట్లు ఎత్తి నీటిని వృధాగా వదలివేశారు. ఖరీఫ్‌కు నీరందించలేక పోయినా కనీసం యాసంగి పంటకు పూర్తిగా నీరందుతుందని ఆశించిన రైతులకు ఈ సారి కూడా ఊరట లభించటం లేదు. మిడ్‌మానేర్‌ ప్రాజెక్టు పూర్తయినా దీనిని నింపలేక పోవటంతో రెండవదశ ఆయకట్టుకు నీరందే అవకాశం కనిపించటం లేదు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన అతి పెద్ద ప్రాజెక్టుగా పేరుగాంచిన ఈ ప్రాజెక్టులో భారీగా పూడిక చేరటంతో నీటి నిల్వ సామర్ద్యాన్ని 30 టీఎంసీల మేరకు కోల్పోయింది. ఫలితంగా నిర్ధేశించిన ఆయకట్టుకు నీరందటం లేదు. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌ కాలంలో ఈ ప్రాజెక్టు నీరు రైతులకు చేరటం లేదు. 
ఎండమావిగా శ్రీరామ్ సాగర్

ఇటీవలి వరదలతో రిజర్వాయర్‌లో నీటి నిల్వ 90 టీఎంసీలకు చేరినప్పటికీ ఆవిరి, మిషన్‌ భగీరథకు పోను 70 టీఎంసీల నీరు వినియోగించుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేండ్ల క్రితం యాసంగిలో 9 లక్షల ఎకరాలకు సాగునీరందించటమే అప్పట్లో రికార్డుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. ఆ తర్వాత కేవలం ఐదారు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరందుతున్నది. ఎస్సారెస్పీకి 140 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నది. 75 శాతం నీటి లభ్యత ప్రకారం 179.02 టీఎంసీలు ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకునే అవకాశం ఉన్నది. రిజర్వాయర్‌లో నీటి సామర్ధ్యం 120 టీఎంసీల నుఉంచి 90 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో లోయర్‌ మానేర్‌ డ్యాంకు నీరు వదలటంతో 20 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎస్సారెస్పీతో పాటూ కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరందించే మిడ్‌మానేర్‌ ప్రాజెక్టును గత సంవత్సరంమే పూర్తి చేశారు. ఇటీవల ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేర్‌కు నీరు విడుదల చేసినప్పటికీ లీకేజ్‌లు, పగుళ్ల కారణంతో నీటిని పూర్తిగా నిల్వ చేయలేదు.అక్కడి నుంచి లోయర్‌ మానేర్‌కు వదలివేశారు. ఫలితంగా అదనంగా నీటిని నింపుకోవటం సాధ్యం కాలేదు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటూ లోయర్‌ మానేర్‌లో నిల్వ ఉన్న నీటిలో కొంత భాగం ఖరీఫ్‌ చివరి తడికి కూడా ఇవ్వాల్సి ఉన్నది. కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరందించటానికి చేపట్టిన వరద కాల్వ కింద ఈ సంవత్సరం కూడా సాగునీరందించలేని పరిస్థితి ఏర్పడింది. ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లో 1081 అడుగులకు నీరు చేరిన తర్వాత వరద కాల్వ ద్వారా నీరు విడుదల చేసే అవకాశం ఉన్నది. ఈ పథకానికి 20 టీఎంసీల నీటి కేటాయింపు కూడా ఉన్నది. కాల్వ కింద కరీంనగర్‌ జిల్లాలో 1.30 లక్షలు, జనగామ ప్రాంతంలో 60 వేలు, ఆలేరు ప్రాంతానికి 30 వేల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించారు. జనగామ, ఆలేరు ప్రాంతాలకు ఇప్పటి వరకూ నీరందించలేదు. నీటి లభ్యత లేదనే కారణంతో జనగామ ప్రాంత ఆయకట్టును దేవాదుల ప్రాజెక్టు పరిధిలోకి తెచ్చారు. కరీంనగర్‌ జిల్లాలోని ఆయకట్టుకు కూడా ప్రస్తుత నీటి సంవత్సరంలో నీరందించే అవకాశం కనిపించటం లేదు. ఇంకా ప్రధాన కాల్వ పనులు జరుగుతూనే ఉన్నాయి.ఎస్సారెస్పీ ప్రాజెక్టును నింపటానికి పునరుజ్జీవం పథకం పేరుతో ఒక ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు వెయ్యి కోట్ల అంచనాలతో ప్రారంభించిన ఈ పథకంలో ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీటిని మిడ్‌మానేర్‌ ఎగువ భాగం నుంచి మూడు దశల్లో ఎత్తిపోయటం ద్వారా ప్రాజెక్టును నింపటానికి పనులు చేస్తున్నారు. 99 కిలోమీటర్‌ నుంచి 33 కిలోమీటర్‌ వరకూ రెండు దశల పనులు పూర్తి కావచ్చాయి. మూడవ పంప్‌హౌస్‌ పనులు కొనసాగుతున్నాయి. ఈ పథకాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ ప్రకటించినప్పటికీ ఇది సాధ్యం కాలేదు.ఎస్సారెస్పీలోని అకేరు రిజర్వాయర్‌ తర్వాత 284 నుంచి 347 కిలోమీటర్‌ పరిధిలోని ఆయకట్టును రెండవ దశలోకి చేర్చారు. ఈ దశలో వరంగల్‌ జిల్లాలో 1,13,571 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 68,914 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 2,57,508 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. ఇప్పుడు ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటితో రెండవదశకు నీరందించే అవకాశం లేదని నీటిపారుదల శాఖ అధికారులంటున్నారు. ఖమ్మం జిల్లాలోని ఆయకట్టును తాత్కాలికంగా భక్తరామదాసు ఎత్తిపోతల పథకం కిందకి తెచ్చి పాలేరు ద్వారా కృష్ణా నీటిని అందచేస్తున్నారు. నల్లగొండ, వరంగల్‌ జిల్లాల రైతులు రెండవదశ నీటి కోసం ఏండ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. యాసంగిలో కూడా మొదటి దశ వరకే నీరందించే అవకాశం ఉన్నది