హస్తినలో హెల్త్ ఎమర్జెన్సీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హస్తినలో హెల్త్ ఎమర్జెన్సీ

న్యూడిల్లీ, నవంబర్ 2  (way2newstv.com)
దీపావళి తర్వాత దేశ రాజధానిలో ఒక్కసారిగా వాయు కాలుష్యం కోరలు చాచింది. అమాంతం పెరిగిపోయిన గాలి కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతేకాదు, శుక్రవారం నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో కెల్లా అత్యంత కాలుష్యపూరిత నగరంగా ఢిల్లీ నిలిచింది. పొంగ మంచు దుప్పటిలా కప్పేసి గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఢిల్లీలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించారు. నవంబరు 5 వరకు పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. శ్వాసకోశ, హృదయ సంబంధిత సమస్యలతో హాస్పిటల్స్‌లో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.గురువారం రాత్రి నుంచి గాలిలో నాణ్యత మరింత వేగంగా క్షీణించడంతో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి రంగంలోకి దిగింది. శీతాకాలం ముగిసేవరకు బాణసంచా కాల్చరాదని ఆదేశాలు జారీచేసింది. 
హస్తినలో హెల్త్ ఎమర్జెన్సీ

అలాగే ఢిల్లీ, ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, నోయిడా పరిసర ప్రాంతాల్లో నిర్మాణ పనులను ఐదు రోజుల పాటు నిషేధించారు. విద్యార్థులు కాలుష్యం బారిన పడకుండా అత్యాధునిక ‘ఎన్‌95’ మాస్కులను కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం పంపిణీ చేసింది.ఢిల్లీలో కాలుష్యం ఈ స్థాయిలో పెరిగిపోవడానికి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తుండటమే ప్రధాన కారణం. శుక్రవారం ఒకదశలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 484కు చేరింది. 500+కు చేరి 48 గంటలకు కొనసాగితే గాలి నాణ్యతను అత్యంత ప్రతికూలంగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత వాహనాల వినియోగంలో సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ట్రక్కుల ప్రవేశం.. నిర్మాణ పనులపై నిషేధం పొడిగిస్తారు. సోమవారం నుంచి సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. శుక్రవారం నాడు గాలి నాణ్యత సూచి 484కు చేరుకోవడం ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. జనవరి 3 అత్యధికంగా 444కు చేరింది. అయితే, 2016 నవంబరు 6న నమోదైన 497 పాయింట్లే ఇప్పటి వరకు అత్యధికం.ఢిల్లీ పరిసర రాష్ట్రాలకు లేఖ రాసిన ఈపీసీఏ ఛైర్మన్ భూరే లాల్.. ఇందులో పలు సూచనలు చేశారు. చిన్నారులు, వృద్ధులు బయట తిరగడం మంచిది కాదని సూచించారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌‌ప్రదేశ్‌లో పంట వ్యర్థాలను దహనం చేయకుండా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, నోయిడా, బహదూర్‌గఢ్‌, భివాండి, గ్రేటర్‌ నోయిడా, సోనేపట్‌, పానిపట్‌ ప్రాంతాల్లో నవంబరు 5 వరకు బొగ్గు, ఇంధన ఆధారిత పరిశ్రమలను మూసివేయాలని ఆదేశించారు