ధర్మాన ప్లానింగ్ ప్రారంభించేశారా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ధర్మాన ప్లానింగ్ ప్రారంభించేశారా...

శ్రీకాకుళం, నవంబర్ 5, (way2newstv.com)
రాజకీయాల్లో రాగద్వేషాలు ఉండవని అంటారు. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ఆ అన్నా చెల్లెళ్ళు మాత్రం వాటికి అతీతం. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కూడా ఆయనకు ఆమె చెల్లెలే. ఆమెకు ఆయన అన్నయ్యే. ఆ అపురూప బంధం శ్రీకాకుళం జిల్లాలో చూడవచ్చు. ఆ అన్నయ్య మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే చెల్లెలు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మెంటాడ పద్మావతి. ఆమెకు ధర్మాన రాజకీయం ఇచ్చిన అన్నయ్య అయితే, ధర్మాన ప్రసాదరావుకు ఆమె అభిమానం పంచుకున్న చెల్లెలు. కాంగ్రెస్ లో తిరుగులేని నాయకునిగా రాజ్యం చేస్తున్నపుడు ధర్మాన ప్రసాదరావు ఆమెను చేరదీసి మున్సిపల్ చైర్ పర్సన్ ని చేశారు. ఆమె ఆ పదవిని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా ఇప్పటికీ తనను అంతా చైర్ పర్సన్ గారూ అని సంభోధించేలా జనాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. 
ధర్మాన ప్లానింగ్ ప్రారంభించేశారా...

ధర్మాన ప్రసాదరావు వెంటే ఉంటూ ఆయనతో పాటే కాంగ్రెస్ నుంచి వైసెపీలోకి ఆమె మారిపోయారు. సిక్కోలులో జగన్ పాదయాత్రలో సైతం నడిచి అధినేతను ఆకట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో అన్నయ ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యే కావాలని గట్టిగా కృషి చేసి సాధించిన పద్మావతి ఇపుడు ఆయన అతి ముఖ్య అనుచరురాలిగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నారు.ఇక శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు చూసుకుంటే మాజీ మంత్రి, టీడీపీ నేత గుండా అప్పలసూర్యనారాయ‌ణకు గట్టి పట్టు ఉంది. ఆయన చక్రం తిప్పి అనేక మార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయన కుటుంబాన్ని ఢీ కొట్టాలంటే మెంటాడ పద్మావతి సమఉజ్జీ అని అంటారు. ధర్నాన‌ ప్రసాదరావు 2014 ఎన్నికల్లో ఓడిపోవడానికి గుండా అప్పల సూర్యనారాయణకు పట్టున్న ఏరియాలే కారణం . వాటిలో విస్త్రుతంగా పర్యటించి ఈసారి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావుకు 700 పై చిలుకు మెజారిటీ వచ్చేలా చేసిన ఘనత కూడా పద్మావతిదే. ఇక తొందరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో శ్రీకాకుళం మేయర్ పదవికి ఆమె ప్రధాన పోటీదారుగా వైసీపీ నుంచి ఉన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు, సామాజికవర్గం బలం, జనంలో పేరు, అన్నిటికీ మించి ధర్మాన ప్రసాదరావు అండదండలు ఆమెకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. పైగా టీడీపీ నేత గుండా కుటుంబాన్ని ఢీ కొట్టాలంటే ఆమెకే సాధ్యమని పార్టీ నేతలు నమ్ముతున్నారు.తన చెల్లెలుని మేయర్ చేయాలన్నది ధర్మాన ప్రసాదరావు కోరిక. ఎటూ అన్నయ్య ధర్మాన క్రిష్ణదాస్ మంత్రిగా ఉన్నారు. జిల్లాలో తాను కోరితే టికెట్ రాదన్న అనుమానం కూడా లేదు. దాంతో ధర్మాన ప్రసాదరావు ఇప్పటి నుంచే పద్మావతిని పనిచేసుకోమని అంటున్నారుట. ఆమెను మేయర్ చేసి ఆ కళ్ళలో వెలుగు చూడాలని ఈ అన్నయ్య సంకల్పం. అయితే జగన్ దీనికి ఎంతవరకూ అంగీకరిస్తారన్నది చూడాలి. మరో వైపు శ్రీకాకుళంలో వైసీపీలో వర్గాలు ఉన్నాయి. ధర్మాన ప్రసాదరావుకు వ్యతిరేకంగా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీను, పేరాడ తిలక్ వంటి వారు పావులు కదిపే అవకాశాలు ఉన్నాయి. వీరికి స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా తోడు అవుతారని కూడా అంటున్నారు. ఒకవేళ పట్టుబట్టి ధర్మాన ప్రసాదరావు ఆమెకు టికెట్ తెచ్చుకున్నా రెండవ వర్గం సహకరించదు, ఓడించేందుకు చూస్తుంది. అదే శ్రీరామ రక్షగా టీడీపీ ధీమాగా ఉంది. మొత్తానికి ధర్మాన ప్రసాదరావు సంగతి ఎలా ఉన్నా పద్మావతికి జనంలో బలం, పేరు ఉన్నాయి కాబట్టి ఆమె వరకూ వైసీపీకి గట్టి మేయర్ అభ్యర్ధి అని అంటున్నారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు లేకుండా మేయర్ సీట్లుని గెలుకుని రావాల్సిందేనని జగన్ రెండు వర్గాలకూ గట్టిగా చెబుతూండడంతో పద్మావతి సిక్కోలు తొలి మేయర్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.