ప్రాణాలతో చెలగాటం( అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రాణాలతో చెలగాటం( అనంతపురం)

అనంతపురం, నవంబర్ 11 (way2newstv.com): 
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సూది మందు ఇచ్చే ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస ప్రమాణాలను పాటించడం లేదు. సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణ లోపం.. హౌస్‌సర్జన్ల బాధ్యతారాహిత్యం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు తలెత్తుతోంది. అన్ని విభాగాల్లోనూ ఇదే తీరు. ఏ రోగికి ఏ రకం సూది మందు ఇస్తున్నారోనన్న స్పష్టత ఉండటం లేదు. నర్సింగ్‌ స్టేషన్‌లో రోగులకు ఇవ్వాల్సిన సూది మందును సిరంజీల్లో ఒకేసారి లోడ్‌ చేసుకుని వెళ్తున్నారు. కొందరు గంపగుత్తగా తీసుకెళ్లి సూదులు వేస్తున్నారు. మరికొందరు రోగుల పడకలపై నీడిల్‌ లేకుండా లోడ్‌ చేసిన సిరంజీలను పెట్టేసి వెళ్తున్నారు. 
ప్రాణాలతో చెలగాటం( అనంతపురం)

ఈక్రమంలో పలు రకాల రుగ్మతలు, ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసినా హౌస్‌సర్జన్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సంబంధిత విభాగాల సీనియర్‌ వైద్యులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఆస్పత్రిలో సూది మందు వేసే బాధ్యత హౌస్‌ సర్జన్లదే. జబ్బుల తీవ్రతను బట్టి ఒక్కో రోగికి రెండు నుంచి మూడు పూటలా సూదులు వేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సూది మందు, అవసరమైన వారికి మాత్రలు కూడా ఇస్తారు. ఉదయం సీనియర్‌ వైద్యులు రోగులను పరీక్షించి.. ఏ మందులు ఇవ్వాలో కేసు షీటులో నమోదు చేస్తారు. దీని ఆధారంగా సంబంధిత రోగికి మందులు, సూదులు ఇవ్వాలి. కేసు షీట్లతో నిమిత్తం లేకుండా యాంటిబయాటిక్‌, నొప్పులు, జ్వరం, ఇతరత్రా వాటికి సూది మందులు ఏకకాలంలో వేసేస్తున్నారు. లోడ్‌ చేసిన సిరంజీలను పడకలపై పెట్టేసి, ఇష్టమెచ్చినప్పుడు వేస్తున్నారు. తాజాగా ఎంఎం వార్డులో జ్వరపీడితులకు హౌస్‌సర్జన్‌ కాకుండా వైద్య విద్యార్థితో సూది మందు ఇప్పించినట్లు సమాచారం. అత్యధిక శాతం మంది హౌస్‌ సర్జన్లు విధుల పట్ల కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రతి వార్డుకు ఒక్కో షిఫ్టునకు ఇద్దరు ముగ్గురు హౌస్‌ సర్జన్లను నియమిస్తున్నారు. ప్రతి నెలా వార్డు మార్పు చేస్తారు. ఉదయం విధిగా విధుల్లో ఉంటారు. మధ్యాహ్నం, రాత్రి షిప్టులో విధులు సర్ధుబాటు చేసుకుంటున్నారు. ఒకరు ఉంటే.. మరొకరు డుమ్మా కొడుతున్నారు. మెడికోలు సైతం ప్రతి బ్యాచ్‌కు 15 మంది ఉండాలి. రోగులతో వివరాలు సేకరించే ప్రక్రియలో కొందరు కనిపించడం లేదు. కొందరు హౌస్‌ సర్జన్లు ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పని చేసేందుకు వెళ్తున్నారు. ఈ వ్యవహారం అన్ని విభాగాల ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదు. సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణ కరవైంది.