కాకినాడ, నవంబర్ 4, (way2newstv.com)
ఆ ఎమ్మెల్యే గెలిచినా ప్రయోజనం లేదు. కేవలం ఉత్సవ విగ్రహమే. తనకు తెలియకుండానే అన్ని అధికార కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. పోనీ దానికి అధికారుల వద్ద అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా తాను ఉన్నా ఓటమిచెందిన నేతే అధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అవుతుండటం మింగుడు పడటం లేదు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఇదే. ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యే అయి కూడా లేనట్లే.జనసేన అధినేతతో పాటు అందరూ ఓటమి పాలయినా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. జనసేనకు అసెంబ్లీలో గళం విన్పిస్తుందని ఆనంద పడ్డారు.
రాపాకను పట్టించుకోని అధికారులు
తొలిసారి అసెంబ్లీకి జనసేన ఎమ్మెల్యే వెళ్లడం కూడా జనసైనికులకు అమితానంద పర్చింది. అయితే రాజోలు నియోజకవర్గంలో పరిస్థితి అలా లేదు. ఆయన ఎమ్మెల్యే కాదట. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన బొంతు రాజేశ్వరరావు అంతా తానే అయి కథ నడిపించేస్తున్నాడు. ఎమ్మెల్యేకు తెలియకుండా కూడా అనేక పనులు రాజోలులో జరిగిపోతున్నా పట్టించుకునే అధికారి లేరట.నిజానికి రాపాక వరప్రసాద్ పై మైండ్ గేమ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రారంభమయింది. ఆయన వైసీపీలో చేరుతున్నారని ప్రచారం చేశారు. అయితే రాపాక వరప్రసాద్ గట్టిగానే ఖండించారు. తాను వైసీపీలోకి వెళితే 152 నెంబరవుతుందని, అదే జనసేనలో ఉంటే నెంబరు 1 గా ఉంటానని చెప్పి ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇక తాజాగా బొంతు రాజేశ్వరరావు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడంతో రాపాక వరప్రసాద్ కు మింగుడు పడటం లేదు. అధికారులు కూడా బొంతు రాజేశ్వరరావుకే సహకరిస్తున్నారు.దీంతో రాపాక తనకు పరిచయమున్న మంత్రి పినిపె విశ్వరూప్ ను పలుమార్లు కలసి తన సమన్యలను గురించి వివరించినట్లు తెలిసింది. అయినా కూడా రాజోలులో ఎమ్మెల్యేకు విలువ లేకుండా పోయింది. తాజాగా ఆయనపై మరో మైండ్ గేమ్ మొదలయింది. విదేశాల్లో ఉంటున్న వారిపేర్లతో తాజాఎన్నికల్లో దొంగ ఓట్లువేయించిగెలిచారని హైకోర్టులో బొంతు రాజేశ్వరరావు పిటిషన్ వేసినట్లు తెలిసింది. దీంతో హైకోర్టు రిటర్నింగ్ అధికారితో పాటు రాపాకకు కూడానోటీసులు పంపారని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ప్రజల మద్దతుతో గెలిచిన రాపాక వరప్రసాద్ మాత్రం అక్కడ ఎమ్మెల్యే కాదని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కేవలం పేరుకే ఎమ్మెల్యే. పనులు మొత్తం ఓటమి పాలయిన బొంతు రాజేశ్వరరావు చేస్తున్నారు. ఏం చేయలేని రాపాక మౌనంగానే ఉంటున్నారు. జనసేన నుంచి కూడా రాపాక వరప్రసాద్ కు మద్దతు లభించడం లేదు