హైదరాబాద్ నవంబర్ 7 (way2newstv.com)
యువ గిరిజన పారిశ్రామికవేత్తలను చూడటం ఆనందంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని గచ్చిబౌలి ఐఎస్‌బీలో సీఎంఎస్‌టీ ఎంట్రర్‌ప్రిన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. శిక్షణ పొందిన గిరిజన పారిశ్రామికవేత్తలకు మంత్రులు లోన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తాను హాజరయ్యే చాలా కార్యక్రమాల్లో తనపై ప్రగాఢ ముద్ర వేసేవి కొన్ని మాత్రమే ఉంటాయన్నారు. అటువంటి వాటిల్లో సీఎంఎస్‌టీఈఐ కార్యక్రమం ఒకటన్నారు.
వ్యాపారంలో రాణించడం ఏ ఒక్కరి సొత్తు కాదు: కేటీఆర్
ఏ వృత్తిలో నిబద్దతగా ఉంటే వందశాతం విజయం సాధిస్తారన్నారు. చదువు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కానీ తర్వాత మనం ఏం చేయాలో నిర్ణయం తీసుకోకపోతే విజయం సాధించలేమన్నారు. వ్యాపారంలో రాణించడం ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. ప్రపంచంలో ఎక్కడా చూసినా చిన్న పారిశ్రామికవేత్తలే 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. పెద్ద పారిశ్రామికవేత్తలు 30 శాతం మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మూడు మహిళా పారిశ్రామికవేత్తల పార్కులు ఉన్నాయని తెలిపిన మంత్రి వాటిలో ఈ యువ గిరిజన పారిశ్రామికవేత్తలకు స్థలం కేటాయింపు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా దళిత, గిరిజన, చిన్న పారిశ్రామికవేత్తల కోసం బ్యాంకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.