బలిదానాలు వద్దు...బరి గీసి పోరాడుదాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బలిదానాలు వద్దు...బరి గీసి పోరాడుదాం

మీకు అండగా తెలంగాణ సమాజం ఉంది
 మంత్రుల ఇళ్ళు ముట్టడించి తీరుతాం
కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్
జడ్చర్ల నవంబర్ 11, (way2newstv.com)
బలిదానాలకు స్వస్తి పలికి, బతికుండి బరిగీసి పోరాడుదామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు.. జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గం ఇంచార్జి ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ తో కలిసి మాట్లాడారు.. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారని,ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్న సీఎం కేసీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల బేసిక్ బారెడు, జీతాలు మూరెడు అని,చాలీ చాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించి చర్చలు జరపాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
బలిదానాలు వద్దు...బరి గీసి పోరాడుదాం

తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసిన కార్మికులు నేడు తెరాస పాలనలో దిక్కులేని వారిగా మారారని,ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకే కార్మికులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు.కార్మికుల కుటుంబాల్లో రేషన్ కార్డు,తల్లిదండ్రులకు పెన్షన్ సౌకర్యం,ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, మీకు అండగా తెలంగాణ సమాజం ఉందని.. మీ సమస్యలు పరిష్కారమయ్యే వరకు మీవెంటే ఉంటామని తెలిపారు.  ఛలో ట్యాంక్ బండ్ కు వెళ్లనీయకుండా కార్మికులను ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్ట్ చేసి నిర్బంధించినా కూడా కార్యక్రమం విజయవంతం అయ్యిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి  కళ్ళు తెరచి సానుకూల దృక్పధంతో కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మంత్రులు,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ల ఇళ్ళు ముట్టడి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, పోలీసులు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా మంత్రుల ఇళ్ళు ముట్టడించి తీరుతామని తెలిపారు.రాష్ట్రంలో దుష్ట పాలన నడుస్తుందని,ఈ దొరల పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ఈ  కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గౌతమ్ మహావీర్, బాలరాజు గౌడ్, శివ కుమార్ ముదిరాజ్,కావలి అశోక్, అంజన్న యాదవ్,రాఘవేందర్ గౌడ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు