బెంగళూరు నవంబర్ 28 (way2newstv.com)
మాజీ ప్రధాని దేవేగౌడ మైసూరులో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం రేకెత్తిస్తున్నాయి. దీనితో రాష్ట్రంలో అధికారానికి దూరమైన జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు మరోసారి కలసి ప్రయాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని అయితే జేడీఎస్ నేతల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదని కొట్టిపారేసేవారు లేకపోలేదు. 2018 శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు దాటినా అధికారం చేపట్టే అవకాశం లేకపోయింది. దీంతో కాంగ్రెస్, జేడీఎ్‌సలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 14 నెలలపాటు సంకీర్ణ ప్రభుత్వం సాగింది. కానీ 104మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేవలం 9మంది తక్కువగా ఉండడంతో అధికారాన్ని చేపట్టలేకపోయిన బీజేపీ నిరంతరంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించింది.
సంచలనం రేకెత్తిస్తున్నదేవేగౌడ వ్యాఖ్యలు
చివరకు జూలైలో పెట్టిన ముహూర్తంతో 17మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి శాసనసభలో మెజారిటీ కోల్పోవడంతో ప్రభుత్వాన్ని వదిలేసుకుంది. ఇలా ఆగస్టులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ సారథి యడియూరప్పకు ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. 104మంది ఎమ్మెల్యేలకు ఓ స్వతంత్రుడు చేతులు కలపడంతో 105మందికి బలం పెరిగింది. ఇప్పటికే శాసనసభలో సభ్యులంతా చేరితే బీజేపీకి మెజారిటీ లేనట్టే. ప్రస్తుతం జరిగే ఉపసమరంలో కనీసం 8మంది గెలుపొందితే యడియూరప్ప సర్కార్ సేఫ్‌జోన్‌కు చేరనుంది.కానీ బీజేపీకి అన్ని సీట్లు సాధ్యమవుతాయా... అనేది ప్రశ్నార్థకమవుతోంది. సంకీర్ణం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యర్థులుగా కొనసాగిన దేవేగౌడ కుటుంబంతో కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. సంకీర్ణ సర్కార్ కూలేందుకు బీజేపీ ఎత్తుగడలు కీలకమైనా కాంగ్రెస్ పక్షనేత సిద్దరామయ్య ధోరణి భరించలేకనే దూరమయ్యామనే వారు లేకపోలేదు. సిద్దరామయ్య తీరుతోనే సర్కార్ కూలిందని దేవేగౌడతోపాటు మాజీ సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వలస, మూల అనే బేధాలు కొనసాగుతున్నాయి. సిద్దరామయ్యకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న దేవేగౌడ కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.బీజేపీకి ఉపసమరంలో సీట్లు తగ్గితే డి.కె.శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేస్తే మద్దతు ఇస్తామని కొత్త ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీలో పలువురు నేతల మధ్య చర్చనీయాంశంగా ఉంది. కొత్త ప్రతిపాదనలను బీజేపీ సీరియ స్‌గా భావిస్తుండగా సిద్దరామయ్య కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉపఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయం మరోసారి వేడెక్కనుందనిపిస్తోంది.