ఇంటికే కన్నం పడుతోంది... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంటికే కన్నం పడుతోంది...

విశాఖపట్టణం, నవంబర్ 20, (way2newstv.com)
మాజీ మంత్రి, ఏపీలో ప్రముఖ నాయకుడుగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం సంచలనంగా మారింది. గంటా శ్రీనివాసరావు విషయంలో గతంలో సొంత పార్టీ వారు, ఇతర పార్టీల వారు బ్యాంకులకు గంటా శ్రీనివాసరావు టోకరా పెట్టారు అంటూ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఏకంగా ఇండియన్ బ్యాంక్ ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లుగా పత్రికా ప్రకటన చేసింది. గంటా శ్రీనివాసరావుకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బహుళ అంతస్థుల భవనంలో ఉన్న ఖరీదైన ప్లాట్ ని వేలం వేయడానికి రంగం సిధ్ధం చేసింది. డిసెంబర్ 20న వేలం వేయడానికి బ్యాంకు చ‌ర్యలు తీసుకుంది. ఇదే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. గంటా శ్రీనివాసరావుకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆయన ఖరీదైన రాజకీయం చేస్తారని ప్రచారంలో ఉంది. 
ఇంటికే కన్నం పడుతోంది...

కానీ కేవలం వందల కొట్లలో బాకీ పడినట్లుగా బ్యాంక్ అధికారులు చూపించడమే కాకుండా తమకు వేలం వేయడం తప్ప వేరే గత్యంతరం లేదని కూడా చెప్పడం విశేషం.గంటా శ్రీనివాసరావు రాజకీయల్లోకి రాకముందు ప్రత్యూష కంపెనీ ద్వారా వ్యాపారాలు చేసేవారు. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అన్నది పెద్ద సంస్థగా ఎదగడం వెనక గంటా శ్రీనివాసరావు కృషి ఉంది. గతంలో ఈ సంస్థ అనేక వ్యాపార లావాదేవీల్లో పాలుపంచుకుంది. ఇక విశాఖ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ గ్రంధాలయం స్థలంలో మల్టీ స్టోర్డ్ బిల్డింగులు కట్టేందుకు కూడా పదేళ్ల క్రిత్రం టెండర్లు పొందిన సంస్థగా ప్రత్యూష ఉంది. అయితే వందల కోట్ల రూపాయలు విలువ చేసే గ్రంధాలయ స్థలంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా అట్టిపెట్టుకున్నారన్న దాని మీద వామపక్షాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో అప్పట్లో ఈ లీజు కాంట్రాక్ట్ రద్దు అయింది. ఇక గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ లో మంత్రిగా ఉండగా ఈ ప్రభుత్వ స్థలం తన ప్రత్యూష కంపెనీ పేరిట దక్కించుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే తాను రాజకీయాల్లొకి వచ్చాక ప్రత్యూషతో సంబంధాలు లేవని రాజీనామా చేశానని గంటా శ్రీనివాసరావు గతంలోనే చెప్పారు.ఇక గంటా శ్రీనివాసరావు ఇండియన్ బ్యాంకు రుణాన్ని ప్రత్యూష సంస్థ కోసం తీసుకున్నారని, ఆయనతో పాటు కంపీనీకి చెందిన మరో ఏడుగురు భాగస్వాములు ఉన్నారని కూడా బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం గంటా శ్రీనివాసరావు తన ఖరీదైన ప్లాట్ ని తనఖా పెట్టగా మిగిలిన వారు కూడా తమ ఆస్తులను తాకట్టు పెట్టి భారీగా రుణాలు ప్రత్యూష సంస్థకు తెచ్చారు. అయితే తీసుకున్న రుణానికి సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోవడమే కాకుండా వడ్డీలు కూడా చెల్లించకపోవడంతో ఎన్నో సార్లు నోటీసుకు ఇచ్చి చివరికి విధిలేక వేలం పాటకు వెళ్తున్నామని బ్యాంకు అధికారులు అంటున్నారు.ఇదిలా ఉండగా ప్రత్యూష సంస్థలో గంటా శ్రీనివాసరావుతో పాటు భాగస్వామిగా ఉన్న ఆయన సన్నిహిత బంధువు పరుచూరి భాస్కరరావు ఇపుడు జనసేనలో ఉన్నారు. ఆయనకు ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవి కూడా ఇచ్చింది. మిగిలిన వారు కూడా సన్నిహితులే. మరి వీరంతా ఎందుకు రుణ వాయిదాలు చెల్లించడంలేదన్నది చూడాలి. అయితే గంటా శ్రీనివాసరావు పార్టీ ఓడిన తరువాత ఇన్నాళ్ళకు బ్యాంకు అధికారులు ఆస్తుల వేలం అంటూ రావడం పైన కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్ళాలనుకున్నారు, ఇపుడు బీజేపీలోకి వెళ్తారని అంటున్నారు. దాంతో రాజకీయంగా కూడా ఇది ప్రకంపనలు స్రుష్టిస్తోంది. మరి చూడాలి ఇది ఏ మలుపు తీసుకుంటుందో.