ఎవ్వరికి పట్టని గ్రామాల పారిశుద్ధ్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎవ్వరికి పట్టని గ్రామాల పారిశుద్ధ్యం

కర్నూలు, నవంబర్ 13, (way2newstv.com)
కర్నూలు జిల్లా చిప్పర్తి మండలంలోని 12 పంచాయతీల్లో 16 గ్రామాల్లో ఏ వీధిలో చూసినా మురుగునీరు, చెత్తచెదారం పేరుకొపోయి పందుల స్వైరవిహారం చేస్తున్నాయి. పంచాయతీ పాలక వర్గం పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. వీరు కేవలం గ్రామదర్శిని, పల్లెపిలుపు, పల్లెనిద్ర తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకే సరిపోతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్పంచుల పదవి కాలం ముగిశాక గ్రామాల్లో పారిశుధ్యం పడేకేసింది. గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించినా ఫలితం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రత్యేకాధికారులు కేవలం గ్రామదర్శిని తదితర ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమయ్యారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. 
ఎవ్వరికి పట్టని గ్రామాల పారిశుద్ధ్యం

సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి వెళ్లిపోతున్నారే తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. గ్రామాల్లో రోడ్ల వెంట మురికినీరు నిలువ ఉండి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగరడోణ, నేమకల్లు, ఏరూరు గ్రామాల వీధుల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వీటిని దూరంగా తరలించాలని ఆదేశాలున్నా అమలు చేసే వారు కరువయ్యారు. పందుల యజమా నులకు అధికారులు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.పది రోజులుగా గ్రామాల్లోని కాలువలను శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లి కంపు కొడుతోందని ప్రజలు పేర్కొంటు న్నారు. కొన్ని పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు లేక రోడ్లపైనే మురికినీరు ప్రవహించి దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో కార్మికులున్నా వారికి సరిపడ్డ వేతనం ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. దీంతో పారిశుధ్య పనులు చేసేవారులేక దుర్గంధంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ ప్రత్యేకాధికారులు, సిబ్బంది స్పందించి గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య పనులపై దృష్టి కేంద్రీకరించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.