ఒక్కొక్కరుగా దూరమౌతున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒక్కొక్కరుగా దూరమౌతున్నారు

కడప, నవంబర్ 30, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చవి చూడటంతో ఆ పార్టీ సీనియర్ నేతలు సయితం ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. కొందరు మౌనంగా తమ వ్యాపారాలు చూసుకుంటుండగా మరికొందరు పూర్తిగా పార్టీని పక్కన పెట్టేశారు. సీనియర్ నేతలు కొందరు పార్టీ తమకు చేసిన అన్యాయంపై గుర్రుగా ఉన్నారు. టిక్కెట్ ఇవ్వకపోగా అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి పాలయిన తర్వాతనే తమ అవసరం గుర్తొచ్చిందా? అన్న ప్రశ్నలు కూడా వారు సంధిస్తున్నారు.జిల్లాలో సీనియర్ నేత వరదరాజులురెడ్డి ఆ కోవకు చెందిన వారే. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. 
ఒక్కొక్కరుగా దూరమౌతున్నారు

వరదరాజులు రెడ్డి వర్గం టీడీపీకి పూర్తిగా దూరంగా ఉంది. వరదరాజులు రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వరదరాజులు రెడ్డి, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరస విజయాలు సాధించారు.అయితే రాష్ట్ర విభజన జరగడంతో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారారు. 2014లో చంద్రబాబు వరదరాజులు రెడ్డికి టిక్కెట్ ఇచ్చినా ఆయన ఓటమి పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలులు ఆ ఎన్నికల్లో వీచినా వరదరాజులు రెడ్డి గెలుపొంద లేకపోయారు. దీంతో ఆయనకు 2019 ఎన్నికల్లో చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. వరదరాజులురెడ్డికి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. అప్పట్లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లింగారెడ్డికి మద్దతు పలకడంతో వరదరాజులు రెడ్డి సీఎం రమేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు.ఇక తెలుగుదేశం పార్టీలో ఉంటే రాజకీయ భవిష‌్యత్తు ఉండదని భావించి పార్టీ మారేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు సమావేశాలకు కూడా వరదరాజులు రెడ్డి దూరంగా ఉన్నారు. పార్టీలో తన ప్రత్యర్థి లింగారెడ్డికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని భావించి ఆయన సైడయిపోయారని చెబుతున్నారు. వైసీపీలోకి వెళ్లాలన్నా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వరదరాజులు రెడ్డి వర్గం వైసీపీకి పరోక్షంగా మద్దతిచ్చిందని లింగారెడ్డి వర్గం ఇప్పటికే చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. మొత్తం మీద వరదరాజులు రెడ్డి పార్టీకి దూరమయినట్లే.