ముంబై, నవంబర్ 29 (way2newstv.com)
మొన్నటి వరకూ ఆయన విజేత. దేశంలోనే బీజేపీ ముఖ్యమంత్రులకు ఆయన ఒక మార్గదర్శకం. అలాంటిది ఒక్కరోజులోనే ఆయన ప్రతిష్ట మసకబారింది. కేంద్ర నాయకత్వం ఆదేశాలను అమలు పర్చడం వల్లనో….లేక ముందుచూపు లేని నిర్ణయాలు తీసుకోవడం వల్లనో అవమానకరంగా పదవి దిగిపోవాల్సి వచ్చింది. ఆయనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. దేవేంద్ర ఫడ్నవిస్ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఆయన ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగానే మిగిలిపోవాల్సిందేనా? లేక మరోసారి తన డైనమిజాన్ని చూపించే ప్రయత్నం చేస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.2014 ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు బయటకు వచ్చింది. దేవేంద్ర ఫడ్నవిస్ 1970లో నాగపూర్ లో జన్మించారు. చిన్నప్పుటి నుంచే సంఘ్ పరివార్ లో చేరారు.
పని చేయని ఫడ్నవిస్ క్లీన్ ఇమేజ్
బీజేపీ అనుబంధ సంఘమైన ఏబీవీపీలోనూ చాలా కాలం పనిచేశారు. తర్వాత నాగపూర్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఫడ్నవిస్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1997లో దేవేంద్ర ఫడ్నవిస్ నాగ్ పూర్ మేయర్ పదవి కూడా చేపట్టారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి పదవి దాకా ఆయన రాజకీయ ప్రస్థానం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగింది.నాగ్ పూర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన దేవేంద్ర ఫడ్నవిస్ ను నరేంద్ర మోడీ, అమిత్ షాలు గుర్తించారు. ముఖ్యమంత్రిని చేశారు. ఐదేళ్లపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వసంత్ దాదా పాటిల్ తర్వాత పూర్తి కాలం సీఎంగా పనిచేసిన రికార్డును దేవేంద్ర ఫడ్నవిస్ సాధించారు. మరాఠాలు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎంపిక చేయడం సాహసంతో కూడుకున్నదే. అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా యువకుడైనా పరిణితి ప్రదర్శించారు. శివసేనతో సర్దుకుని వెళ్లి పాలన సాఫీగా సాగేందుకు ప్రయత్నించారు.క్లీన్ ఇమేజ్ ను సంపాదించుకున్న దేవేంద్ర ఫడ్నవిస్ 44 ఏళ్లకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2019 ఎన్నికల ఫలితాలు దేవేంద్ర ఫడ్నవిస్ పాలనకు నిదర్శనమనే చెప్పాలి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే శివసేన హ్యాండ్ ఇవ్వడంతో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో చేతులు కలిపారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడురోజులకే దిగిపోయి దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శలను ఎదుర్కొనాల్సి వచ్చింది. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు అధికారం కోసం పాకులాడటం, భంగపడటం ఆయనకు మచ్చ తెచ్చేదే. అయితే కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే దేవేంద్ర ఫడ్నవిస్ నడుచుకున్నారన్నది పార్టీ వర్గాల టాక్. బీజేపీ అధ్యక్షుడిగా ఉండి గతంలో అనేక కుంభకోణాలు వెలికి తీసిన ఫడ్నవిస్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రాణిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద దేవేంద్ర ఫడ్నవిస్ పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుందనేది చూడాలి.