విజయవాడ, నవంబర్ 4, (way2newstv.com)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారుల చేతుల్లో బందీ అయ్యారా? చంద్రబాబు తరహాలోనే జగన్ కూడా అధికారులకు పూర్తిగా లొంగిపోయారనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వద్ద కూడా ఇదే తరహా అధికార గణం ఉండేది. జగన్ ఎవరు చెప్పినా వినరన్న ఒక ప్రచారం ఉంది. అది ఎంత మాత్రం నిజమో తెలియదు కాని, తాను నమ్మిన అధికారులు చెబితే మాత్రం ఖచ్చితంగా వింటారన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలోనూ జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెబుతున్నారు.ఎల్వీ సుబ్రహ్మణ్యం మరికొద్దిరోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన సీఎస్ గా రిటైర్ అవ్వాలని భావించారు. కానీ జగన్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆ అవకాశమివ్వకుండా బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా బదిలీ చేసి పంపేశారు.
పేర్లే తేడా... మిగిలినదంతా సేమ్ టూ సేమ్
ఇందుకు అనేక కారణాలున్నాయి. ఇటీవల సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు, ముఖ్యమంత్రి జగన్ కు మధ్య గ్యాప్ వచ్చింది. కొన్ని విషయాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యతిరేకించారని వినికిడి.ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను జగన్ తన సీఎం పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించుకున్నారు. ప్రవీణ్ ప్రకాష్ తొలి నుంచి వివాదాల నేపథ్యం ఉన్న అధికారి. ఆయన సీఎం కార్యాలయంలో చేరిన వెంటనే కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ అజెండా సీఎస్ అనుమతి లేకుండా పంపించారు. అలాగే జీఏడీ అధికారుల బదిలీ విషయంలోనూ తనకే అధికారమని ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. అది బిజినెస్ రూల్స్ సవరిస్తూ ప్రవీణ్ ప్రకాష్ జీవో కూడా జారీ చేశఆరు. ఇది విరుద్ధమని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.అమరావతి రాజధాని విషయంలోనూ అంతర్గతంగా జరిపిన చర్చలు బయటకు లీకయ్యాని జగన్ అభిప్రాయపడ్డారు. దీనికి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అనుమానించారు. అయితే ఒక ప్రభుత్వం చీఫ్ సెక్రటరీని బదిలీ చేయడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. అధికారుల ఉచ్చులో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక కిందిస్థాయి అధికారి ప్రోద్బలంతో ఏకంగా సీఎస్ ను బదిలీ చేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. చంద్రబాబుకు, జగన్ కు పెద్దగా తేడా ఏమీ కన్పించడం లేదన్నది అధికార వర్గాల్లో నడుస్తున్న చర్చ.