టీడీపీని భయపెడుతున్న ఆ ఐదు నియోజకవర్గాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీని భయపెడుతున్న ఆ ఐదు నియోజకవర్గాలు

తిరుపతి, నవంబర్ 19, (way2newstv.com)
పుంగనూరు….ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ ఎప్పుడైతే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారో అప్పటి నుంచి అది వైసీపీకి కంచుకోటగా మారిపోయింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పుంగనూరులో టీడీపీ మంచి విజయాలే నమోదు చేసింది. 1983, 85, 89,1994, 1996, వరకు ఇక్కడ టీడీపీ జైత్రయాత్రే కొనసాగింది. అయితే 1999లో ఓడిపోయినా…వైఎస్ వేవ్ ఉన్న 2004లో ఇక్కడ టీడీపీ తరుపున మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు.ఇక ఇక్కడ వరకు టీడీపీకి ఇబ్బంది లేదు. కానీ 2009 నుంచి పీలేరు వదిలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు బరిలో దిగారు. దీంతో విజయం ఆయన వైపు నిలబడింది. అటు అమర్నాథ్ రెడ్డి కూడా పలమనేరుకు వెళ్లిపోవడంతో..ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. 
టీడీపీని భయపెడుతున్న  ఆ ఐదు నియోజకవర్గాలు

2009 ఎన్నికల్లో వెంకటరమణ రాజు టీడీపీ తరుపున బరిలోకి దిగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలోకి వెళ్ళి జగన్ వెంట నడిచారు. ఇక 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి అదే టీడీపీ అభ్యర్ధి వెంకటరమణ రాజుపై దాదాపు 31 వేల మెజారితో విజయం సాధించారు.అయితే 2019 ఎన్నికలకొచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. చంద్రబాబు వెంకటరమణని తప్పించి మాజీ మంత్రి అమర్నాథ్ మరదలు పెద్దిరెడ్డి అనీషా రెడ్డిని టీడీపీ తరుపున బరిలోకి దింపారు. అయినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజాయానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. 42 వేల భారీ మెజారిటీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడోసారి పుంగనూరు నుంచి విజయం సాధించారు. తాజా ఎన్నిక‌ల్లో ఓటమి తర్వాత పుంగనూరులో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అనీషారెడ్డి కూడా సైలెంట్ గా ఉండటంతో నియోజకవర్గంలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయ్యేలా కనిపిస్తోంది.ఇక ఇక్కడ గ‌తంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన వెంట‌క‌ర‌మ‌ణ రాజు సైతం నాకు టిక్కెట్ ఇవ్వలేద‌ని… అయినా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో నియోజ‌క‌వ‌ర్గంలో తాను ఏం చేయ‌ద‌ల‌చుకోలేన‌ని ఖ‌రాఖండీగా చెప్పేశార‌ట‌. ఇక అనీషారెడ్డి ఆర్థికంగా చితికి పోవ‌డంతో ఆమె అస‌లు రాజ‌కీయాల్లో ఉండ‌ని ప‌రిస్థితి. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి కూడా కావడంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసే అవకాశముంది.ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి త‌న‌యుడు మిథున్‌రెడ్డి ఎంపీగా ఉండ‌డంతో యువ‌త‌ను ఆయ‌న ఎట్రాక్ట్ చేసేస్తున్నారు. అలాగే టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు కూడా వైసీపీ వైపు వెళ్లిపోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇక్కడ తిరుగులేన‌ట్టే క‌నిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో ఎన్నిక‌ల‌య్యాక ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి నాయ‌క‌త్వ లేమి ఏర్పడింది. అందులో పుంగూరు ప్రథ‌మ స్థానంలో ఉంది. అసలు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నంత కాలం టీడీపీ మనుగడ కష్టమే అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి