ఫ్రైడే...కోర్టు మెట్లుఎక్కాల్సిందే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫ్రైడే...కోర్టు మెట్లుఎక్కాల్సిందే

హైద్రాబాద్, నవంబర్ 4, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేషీ ఇక శుక్రవారం నాడు సీఎం షెడ్యూల్ ఖాళీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. తాజాగా సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో అలా చేయక తప్పదు. ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురయ్యింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. మొన్నటి వరకూ జగన్ విపక్ష నేత కాబట్టి ప్రభుత్వబాధ్యతల పరంగా ఇబ్బందులంటూ ఏవీ లేవు. ఇప్పుడు ఆయన సీఎం కావడంతో ప్రతీ శుక్రవారం విజయవాడ నుంచి హైదరాబాద్ కు రావాలంటే ఇబ్బంది తప్పదు. ఇక సీఎం జగన్ అలా రావాలంటే ప్రైవేటు హెలికాప్టర్ అయితేనే వీలవుతుంది. సమయం వృథా కాకుండా ఉంటుంది. సెక్యూరిటీపరంగా, ఇతరత్రాగా లక్షల్లో ఖర్చు తప్పదు. నిజానికి సీఎం జగన్ ఈ కారణాలతోనే వారం వారం సీబీఐ కోర్టుకు హాజరు కావడం నుంచి మినహాయింపు కోరారు. తాను ఇప్పుడు రాజ్యాంగపరమైన హోదాలో ఉన్నందున మినహాయింపు లభిస్తుందని ఆశించారు. 
 ఫ్రైడే...కోర్టు మెట్లుఎక్కాల్సిందే

సీబీఐ మాత్రం స్టాంగ్ కౌంటర్ ఇచ్చింది. సీబీఐ జగన్ పిటిషన్‌పై గట్టిగా వాదనలు వినిపించింది. ఈ కేసులో పరిస్థితులు మారాయి తప్పితే నేరంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. జగన్ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయాలని ప్రయత్నించారని జగన్ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని చెప్పింది. జగన్ పై దాఖలు చేసిన 11 చార్జ్ షీట్స్ ఆయన వ్యక్తిగత స్థాయిలో, తన కంపెనీలకు ప్రతినిధిగా దాఖలైనవని నిందితుడి హాజరు తప్పని సరి అని చెప్పింది. ఆర్థిక నేరానికి సంబంధించిన కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. కేసు దాఖలై ఆరేళ్ళయినా పెద్దగా పురోగతి లేకపోవడాన్ని కూడా సీబీఐ ప్రస్తావించింది. ఏదో ఒక మిషతో కేసును నిందితుడు జాప్యం చేస్తున్నారని తెలిపింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సీఎం జగన్ అభ్యర్థనను సీబీఐ కోర్టు డిస్మిస్ చేయడాన్ని విపక్షం ఆయుధంగా మలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన చిన్నా పెద్ద నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ దీన్నొక పెద్ద రాజకీయ అంశంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్క రోజు హాజరు మినహాయింపుతో సీఎంగా జగన్ ఏం సాధిస్తారని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. జగన్ జైలు కెళ్ళడం ఖాయమని టీడీపీ నాయకులు జోస్యం చెబుతున్నారు. సీబీఐ కోర్టుకు జగన్ వ్యక్తిగత హాజరు విషయంలో మొదటి నుంచి కూడా కొంత కఠినంగానే ఉంటోంది. పాదయాత్ర సందర్భంలోనూ జగన్ రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లారు. తాజా తీర్పు విషయంలో వైసీపీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. సీబీఐ వాదన హాస్యాస్పదంగా ఉన్నా, కోర్టులపై తమకు గౌరవం ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. పాదయాత్ర సమయంలో కూడా జగన్ కు మినహాయింపు ఇవ్వలేదని ఆయన అన్నారు. కోర్టు తీర్పు రాగానే విపక్షం తీవ్రస్థాయిలో విమర్శలు చేయడాన్ని అంబటి రాంబాబు తప్పు పట్టారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామన్నారు. జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం మరీ పెద్ద విషయమేం కాదు. గతంలోనూ ఆయన హాజరయ్యారు. కాకపోతే ఇప్పుడు సీఎం కావడంతో ఆ విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో రాజకీయ నాయకులపై రకరకాల కేసులు నమోదు కావడం సహజమే. చాలా సందర్భాల్లో అవి పెండింగ్ లో పడిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో నిర్దోషులుగా బయటికొస్తారు. సీఎం అయిన తరువాత జగన్ ముందు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే ప్రతీ రోజూ ముఖ్యమైందే. అదే సమయంలో వ్యక్తిగత స్థాయిలో గతంలో దాఖలైన కేసులకు ప్రస్తుత రాజ్యాంగ హోదా ను ఆయన అడ్డం పెట్టుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏమైతేనేం ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకూ ఇలాంటివే మరెన్నో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ విపక్షాలకు ఆయుధాలుగా మారే అవకాశం కూడా ఉంది. వాటిని వైసీపీ నేతలు ఎలా తిప్పికొడుతారో వేచి చూడాల్సిందే.