రాజధానిపై కొనసాగుతున్న ఉత్కంఠ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజధానిపై కొనసాగుతున్న ఉత్కంఠ

విజయవాడ, నవంబర్ 20 (way2newstv.com)
ఏపీ రాజధానిపై త్వరలోనే క్లారిటీ రానుందా ? రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే హైకోర్టును రాయలసీమకు కేటాయిస్తారా ? ప్రాంతీయ అసమానతలు లేకుండా చూస్తామని మంత్రులు తాజాగా చేస్తున్న వ్యాఖ్యల పరమార్ధం ఇదేనా ? రాజధాని భవిష్యత్తు తేల్చేందుకు నియమించిన నిపుణుల కమిటీ రేపోమాపో తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమవుతున్న వేళ.. రాజధానితో పాటు హైకోర్టు, ఇతర సంస్ధలు ఎక్కడ కేంద్రీకృతం కాబోతున్నాయనే అంశం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.ఏపీలో అధికారం చేపట్టిన వెంటనే రాజధాని కొనసాగింపుపై ఉత్కంఠభరిత ప్రకటనలు చేసిన మంత్రులు కొంతకాలంగా శాంతించినట్లే కనిపిస్తున్నారు. రాజధాని పేరెత్తకుండానే అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రం జపిస్తున్నారు. 
రాజధానిపై కొనసాగుతున్న ఉత్కంఠ

గతంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను పునరావృతం చేయబోమని తేల్చిచెబుతున్నారు. తమ తమ శాఖలకు సంబంధించిన విభాగాలను, కార్యాలయాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా బోటు ప్రమాదాల నివారణపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా త్వరలో బోటు ప‌్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసే 9 కంట్రోల్ రూమ్ లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చివరిగా రాజధాని విషయంలో మాత్రం దాదాపుగా అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది.అయితే ప్రస్తుతం వెలగపూడిలోని సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణం అక్కడి నుంచి మంగళగిరికి తరలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాజా టోల్ గేట్ కు సమీపంలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటుకు తగిన ప్రాంతంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు నిపుణుల కమిటీ పర్యటన, అనంతర పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. రాజధాని ప్రాంత రైతులకూ ఈ విషయంలో నిపుణుల కమిటీ ఈ మేరకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అమరావతిలో ఉన్న రాజధానిని వేరే ప్రాంతానికి తరలింపుకు బదులుగా కేవలం సమీపంలోకి మాత్రమే మార్చబోతున్నట్లు సమాచారం. దీనికి న్యూ అమరావతి పేరు కూడా ఖరారైనట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది.హైకోర్టు విషయంలో మాత్రం తరలింపే మేలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు కనబడుతోంది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చడం తథ్యమన్న వాదన వినబడుతోంది. రాయలసీమలో అభివృద్ధి కోసం పెరుగుతున్న డిమాండ్లు, గతంలో కుదుర్చుకున్న పెద్ద మనుషుల ఒప్పందాల రీత్యా చూసినా కర్నూలుకు హైకోర్టు తరలింపు తప్పదనే వాదన వినిపిస్తోంది.రాజదాని ప్రాంత అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఆరువారాల పర్యటనలు, బహిరంగ విచారణలు పూర్తి చేసుకుని సర్కారుకు తమ నివేదిక అందించేందుకు సిద్ణమైంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రాజధానితో పాటు హైకోర్టు, ఇతర సంస్ధల భవిష్యత్తుపై ఓ ప్రకటన చేయబోతోంది. బహుశా డిసెంబర్ లోనే ఈ ప్రకటన ఉండే అవకాశాలూ లేకపోలేదు. రాజధానిని తరలించడం కంటే ప్రస్తుత అమరావతి ప్రాంతంలోనే వేరే ప్రాంతానికి మార్చడం ద్వారా గత ప్రభుత్వ తప్పులను సరిచేయాలనే నిర్ణయానికి జగన్ సర్కారు వచ్చినట్లు కనబడుతోంది. రాష్ట్ర ఆర్ధిక స్ధితిగతులు, ఇతరత్రా కారణాల దృష్ట్యా ఇదే మేలైన నిర్ణయమని భావిస్తున్నట్లు వివిధ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.