కర్నూలు, నవంబర్ 9, (way2newstv.com)
కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలుకు చెందిన సీనియర్ రాజకీయ నేత. ఇప్పటి వరకు ఆయన పాణ్యం నియోజకవర్గం నుంచి ఆరు సార్లు విజయం సాధించారు. అయితే, ఆయన ఇప్పటి వరకు ఎలాంటి కీలక పదవినీ అందుకున్నది లేకపోవడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడిగా కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆయన కొద్ది తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలోనే గౌరు చరితారెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న నాటి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే, తాజాగా ఎన్నికల ముందు కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు.
కాటసానికి దారేది
ఈ క్రమంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రజాబలం గమనించిన జగన్.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. వైఎస్ కుటుంబానికి ఆప్తులుగా ఉన్నప్పటికీ.. గౌరు ఫ్యామిలీని పక్కన పెట్టి కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో గౌరు ఫ్యామిలీ వెంటనే టీడీపీలోకి చేరిపోయి టీడీపీ టికెట్‌పై పోటీ చేయడం కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఓడిపోవడం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు ఆరుసార్లు విజయం సాధించిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి మంత్రి వర్గంలో సీటు లభించడం ఖాయమని ఆయన అనుచరులు అనుకున్నారు. అయితే, తొలి మంత్రివర్గ విస్తరణలో జరగలేదు.ఎన్నికలు అయ్యాక చాలా మందికి జగన్ నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వీరిలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గురించే జగన్ పట్టించుకోలేదు. ఒక వేళ రెండున్నరేళ్ల తర్వాత ఇవ్వాలని అనుకున్నా.. రెండు కీలక ప్రతిబంధకాలు జగన్ ను వెంటాడుతున్నాయి. ఒకటి ఇదే జిల్లా డోన్ నుంచి విజయం సాధించిన బుగ్గన రాజేంద్రనాథ్‌కు జగన్ తన మంత్రి వర్గంలో కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించాడు. రెండున్నరేళ్ల తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే.. ఖచ్చితంగా బుగ్గనను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అయితే, ఇది సాధ్యమేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.ఇక, అదేసమయంలో టీడీపీ నుంచి 2017 నంద్యాల ఉప ఎన్నికల సమయంలో తన ఎమ్మెల్సీ పదవిని కూడా పక్కన పెట్టి.. మరీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఆయన కూడా రాజకీయంగా చాలా సీనియర్. ప్రస్తుతం ఈయన శ్రీశైలం నుంచి వైసీపీ టికెట్‌పై విజయం సాధించారు. మరి ఈయన కూడా రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గం రేసులో ఉన్నారని అంటున్నారు. దీంతో జగన్ అటు కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇస్తారా? లేక పదవిని కూడా త్యాగం చేసి వచ్చి జగన్‌కు జై కొట్టిన శిల్పాకు ఇస్తారా? అనేది ఆసక్తిగా మారింది. అదే సమయంలో బుగ్గనను తప్పిస్తారా? అనేది మరో సందేహం. ఇన్ని ఈక్వేషన్ల నేపథ్యంలో సీనియర్ అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి పదవి వస్తుందా ? రాదా ? అన్నది కాలమే నిర్ణయించాలి.