చంద్రబాబు కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబు కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా

విజయవాడ, నవంబర్ 20 (way2newstv.com)
చంద్రబాబు పదే పదే తన గురించి గొప్పగా చెప్పుకుంటారు. నేను నిప్పుని అని ఆయన అంటారు. నా మీద కేసులు ఏమున్నాయో చెప్పండని కూడా సవాల్ విసురుతారు. నా మీద కేసులు పెడదామని వైఎస్సార్ లాంటి వారు విశ్వప్రయత్నం చేసి చివరికి ఏం చేయలేక చేతులెత్తేసారని చంద్రబాబు జబ్బలు చరుస్తారు. అయితే రాజకీయాలు బాగా తెలిసిన వారికి చంద్రబాబు కేసులు, స్టేల కధ ఎరుకే. చంద్రబాబు దాదాపుగా 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారని వైసీపీతో సహా అన్ని పార్టీలు ఏదో సందర్భంలో ఆరోపించినవే. అయినా సరే చంద్రబాబు మాత్రం తన నీతి కధలు అలా చెబుతూనే ఉంటారు.చంద్రబాబుకు వరసకు అత్త అయిన లక్ష్మీ పార్వతి 2005లో పెట్టిన కేసుకు ఇపుడు ప్రాణం వచ్చింది. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అప్పట్లో లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో కేసు వేశారు. 
చంద్రబాబు కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా

చిత్రమేంటంటే అపుడు కూడా చంద్రబాబు విపక్షంలో ఉంటే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కేసు ఇలా పడగానే అలా చంద్రబాబు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చేశారు. ఇక ఏడాది క్రితం సుప్రీంకోర్టు సుదీర్ఘ కాలం స్టేలు ఉండరాదని, ఆరు నెలల మించి స్టే ఉన్న కేసులు వెంటనే విచారణ ప్రారంభించాలని అదేశాలు జారీ చేసింది. అయితే ఇపుడు దానికి కదలిక వచ్చినట్లుంది. చంద్రబాబు కేసు విచారణకు అలాగే వచ్చేసింది.లక్ష్మీ పార్వతి కేసులు పెట్టిన సమయంలో వైఎస్సార్ ఏలుబడి సాగుతోంది. ఇపుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పైగా లక్ష్మీ పార్వతి ఇపుడు క్యాబినెట్ ర్యాంక్ పదవిలో ఉన్నారు. ఆమెకు జగన్ సర్కార్ మద్దతు ఈ కేసు విషయంలో ముందుకు తీసుకెళ్ళడానికి బాగానే లభిస్తాయన్న ప్రచారం కూడా ఉంది. చంద్రబాబు ఎక్కడ దొరుకుతారా అని గత ఆరు నెలలుగా జగన్ సర్కార్ చూస్తోంది. ఇపుడు వచ్చిన అవకాశం ఉపయోగించుకుంటారని అంటున్నారు. ఇక ఈ కేసు విషయంలో ఎవరికీ పెద్దగా అద్భుతాలు జరుగుతయన్న ఆశలు లేకపోయినా చంద్రబాబు కోర్టు మెట్లు ఎక్కుతారా? లేదా అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది.చంద్రబాబుని ఎప్పటికైనా కోర్టు మెట్లు ఎక్కించాలన్నది వైసీపీ నేతల పంతం. వీలైతే కొన్ని రోజులైనా జైల్లో ఉంచాలని తాపత్రయం. మరి ఈ కేసు రూపంలో కొంత ఆశ అయితే కలుగుతోందని అంటున్నారు. ఇదే వరసలో 1995లో విశాఖలో సాగిన ఏలేరు కుంభకోణం కేసు విషయంలోనూ కదలిక తీసుకురావాలని అధికార పార్టీ చూస్తోందని అంటున్నారు. ఆ కేసులో చంద్రబాబు శాఖాపరమైన విచారణ జరిపించి ఊరుకున్నారు. ఇపుడు జగన్ పూర్తి స్థాయి విచారణకు దిగుతారని అంటున్నారు. అదే విధంగా మిగిలిన స్టేల కేసుల కధ ఎక్కడ వరకూ వచ్చిందో చూసి బుస కొట్టించాలని చూస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. మొత్తానికి జగన్ ఏ కేసుల బారినైతే పడి ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారో చంద్రబాబు కూడా అవే కేసులతో సతమతమయ్యే రోజులు దగ్గర్లో ఉన్నాయని ప్రత్యర్ధులు అంటున్నారు.